డిస్కౌంట్ సేల్స్ అదుర్స్!

3 Oct, 2016 01:48 IST|Sakshi
డిస్కౌంట్ సేల్స్ అదుర్స్!

* లక్షల సంఖ్యలో ఉత్పత్తుల అమ్మకాలు
* ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ ప్రకటన

న్యూఢిల్లీ: పండుగల డిస్కౌంట్ అమ్మకాల్ని ప్రారంభించగానే లక్షలాది ఉత్పత్తుల అమ్మకాలు తమ సైట్ల ద్వారా జరిగినట్టు ఈ కామర్స్ అగ్రశ్రేణి సంస్థలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ ప్రకటించాయి. అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ పేరుతో ఈ నెల 1 నుంచి 5 వరకు డిస్కౌంట్లతో ఆఫర్ సేల్స్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో, స్నాప్ డీల్ అన్‌బాక్స్ దివాళీ పేరుతో ఈ నెల 2 నుంచి ఐదు రోజుల పాటు విక్రయాలు నిర్వహిస్తున్నాయి. భారీ తగ్గింపులతో ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తెలిపాయి.
 
30 నిమిషాల్లో లక్ష ఉత్పత్తుల విక్రయం
సాధారణ రోజుల్లో నిర్వహించే వ్యాపారం కంటే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ మొదటి రోజు ( ఈనెల 1న) ఆరు రెట్లు అధికంగా లావాదేవీలు జరిగాయని అమేజాన్ ప్రకటించింది. మొదటి 30 నిమిషాల్లో లక్ష ఉత్పత్తులు అమ్ముడుపోయినట్టు తెలిపింది. మొదటి 12 గంటల్లో 15 లక్షల వస్తువులు విక్రయించామని వెల్లడించింది.
 
16 గంటల్లో 11 లక్షల లావాదేవీలు: అన్‌బాక్స్ దివాళీ పేరుతో ఆదివారం నుంచి ప్రత్యేక అమ్మకాలు ప్రారంభించిన స్నాప్‌డీల్ మొదటి రోజు మొదటి 16 గంటల్లో 2,800 ప్రాంతాల నుంచి 11 లక్షల మంది కొనుగోళ్లు చేసినట్టు తెలిపింది. శనివారం అర్ధరాత్రి తర్వాత అమ్మకాలు ప్రారంభం కాగా, సెకనుకు 180 ఆర్డర్లు బుక్ అయ్యాయని సంస్థ పేర్కొంది. సాయంత్రం 4 గంటల వరకు లావాదేవీల ప్రకారం... సాధారణ రోజుల్లో జరిగే లావాదేవీల విలువ కంటే ఆరు రెట్లు అధికంగా ఉన్నట్టు స్నాప్‌డీల్ వెల్లడించింది.
 
గంటలో 5 లక్షల ఉత్పత్తులు: ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ విక్రయాలు ఆదివారం ప్రారంభం కాగా మొదటి గంటలోనే ఐదు లక్షల ఉత్పత్తులు అమ్ముడుపోయాయని సంస్థ ప్రకటించింది. ఒక నెలలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో అమ్ముడుపోయే యాపిల్ వాచీల సంఖ్య కంటే అధికంగా తాము తొలి 10 నిమిషాల్లోనే విక్రయించినట్టు ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో పేర్కొంది. 2015లో బిగ్ బిలియన్ డేస్ మొదటి రోజు మొత్తం నమోదైన విక్రయాలను ఈ ఏడాది బిగ్‌బిలియన్ డేస్ మొదటి రోజు తొలి ఆరు గంటల్లోనే అధిగమించినట్టు తెలిపింది. తమ ఫ్యాషన్ ఉత్పత్తుల ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ మింత్రా సైతం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి రోజు మొదటి గంటలో మూడు రెట్లు అధిక విలువ వ్యాపారాన్ని నమోదు చేసినట్టు తెలిపింది.
 
తగ్గింపు అంతా కల్పితం...
ఈ కామర్స్ సైట్లు ఇస్తున్న తగ్గింపు ఏమీ లేదంటూ ట్వీట్టర్‌లో కొందరు యూజర్లు కామెంట్లు పోస్ట్ చేయడం గమనార్హం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ షాపింగ్ ఫెస్టివల్ తగ్గింపు అంతా కల్పితమని, మార్కెటింగ్ గిమ్మిక్కు అనేది ఓ యూజర్ అభిప్రాయం. కొందరు యూజర్లు అయితే ఇతర సైట్లతో పోలిస్తే ఈ సైట్లలో ధరలు అధికంగా ఉన్నాయనేందుకు నిదర్శనంగా స్క్రీన్‌షాట్లను కూడా పోస్ట్ చేశారు. పేమెంట్ గేట్‌వే సమస్యలను కూడా కొందరు ప్రస్తావించారు. మరోవైపు ఈ కామర్స్ సైట్ల బిగ్ సేల్స్ ఎఫ్‌డీఐ పాలసీ ఉల్లంఘనగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పేర్కొంది.

మరిన్ని వార్తలు