నిర్వహణతోనే ఇంటి అందం రెట్టింపు

12 Aug, 2017 00:24 IST|Sakshi
నిర్వహణతోనే ఇంటి అందం రెట్టింపు

సాక్షి, హైదరాబాద్‌
పండుగల సీజన్‌ ప్రారంభమైంది. ఇంటికి రంగులు వేయించడం అందరికీ కుదరకపోవచ్చు. మరెలా? రంగులు వేయకున్నా ఇళ్లంతా మెరిసిపోవాలంటే ప్రణాళి కాబద్ధంగా వ్యవహరించాలి. అదెలాగో ఓసారి చూద్దాం.
మార్బుల్‌ ఫ్లోరింగ్‌ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే సుమా. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్‌ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూలను బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్‌ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపి శుభ్రం చేశాక చూడం
మీ ఫ్లోరింగ్‌ మెరిసిపోతుంది.
కార్పెట్లు దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. కాబట్టి తరచూ వ్యాక్యూమ్‌క్లీనర్‌తో శుభ్రంచేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్‌ కళావిహీనంగా కన్పించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తినే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరకలు తొలగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి.
గోడలను తరచూ స్టాటిక్‌ డస్టర్‌తో తుడవాలి. ఎక్కడైనా బూజు, సాలెగూడు లాంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జెంట్లతో శుభ్రం చేయండి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయరాదు.
కొందరు మైక్రోఓవెన్‌ను అధికంగా వాడుతుంటారు. దీంతో ఇది ఎక్కువగా మురికిపడుతుంటుంది. దీనిని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనీర్‌ను మైక్రోప్రూఫ్‌ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్‌లో వేడిచేయాలి. గట్టిగా ఉండే ఆహార పదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి.

బాత్‌ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్‌ల వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్‌పూతతో వస్తున్నాయిప్పుడు. స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్‌ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపై ఏర్పడే మరకల్ని టూత్‌పేస్టుతో తుడవడం వల్ల తొలగించవచ్చు. వంటింట్లో సింక్‌ పరిశుభ్రంగా కనిపించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్‌ను కలిపి ప్రయత్నించండి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా