యాక్సిస్‌ బ్యాంకుకు 15వేలమంది గుడ్‌బై

8 Jan, 2020 13:59 IST|Sakshi

గత కొన్నినెలలుగా యాక్సిస్‌ బ్యాంక్‌లో రాజీనామాల పరంపర

వరుసగా కంపెనీనీ వీడుతున్న సీనియర్‌, మధ్యస్థాయి ఉద్యోగులు

ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగస్థుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా యాక్సిస్‌ బ్యాంక్‌లో 15వేల మంది ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ వర్గాల ప్రకారం..ఎక్కువగా సీనియర్‌, మధ్య స్థాయి, వినియాగదారులకు సేవలందించే శాఖకు సంబంధించిన ఉద్యోగులే కంపెనీని వీడుతున్నారు.  బ్యాంకులో ఇటీవల తీసుకొచ్చిన నిర్మాణాత్మక, కార్యనిర్వాహక సంస్కరణలు ఈ రాజీనామాలకు దోహదం చేసినట్టుగా భావిస్తున్నారు.

బ్యాంక్‌కు సుదీర్ఘకాలం సేవలందించిన సీఈవో శిఖా శర్మ రాజీనామా తర్వాత కొత్త ఎండీ, సీఈవోగా అమితాబ్ చౌదరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. నూతన మేనేజ్‌మెంట్‌ సరికొత్త సంస్కరణలకు నాంది పలికిన విషయం తెలిసిందే. కొత్తగా నైపుణ్యాలను స్వీకరించేవారు అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని, స్వీకరించని వారే సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి.

కాగా రాజీనామాలు పరంపర కొనసాగుతున్నప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో 28వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నామని, రాబోయే రెండేళ్లలో 30 వేల మందిని నియమించుకోనున్నామని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. ప్రస్తుతం యాక్సిస్‌ బ్యాంక్‌లో 72 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. కొత్త ఉద్యోగాల వల్ల బ్యాంకింగ్ సేవలు మరింత మెరుగయ్యాయని యాక్సిస్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్ రాజేష్‌ దహియా అన్నారు. ఆయన స్పందిస్తూ..వృద్ది, ఆదాయ పురోగతి, స్థిరత్వం అంశాలలో పురోగతి సాధించే విధంగా తమ ప్రణాళిక ఉంటుందని, తమ ఉద్యోగులే నిజమైన ఆస్థి అని తెలిపారు. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజన్స్‌) వల్ల కొత్త నైపుణ్యాలను అలవర్చుకున్న వారికి ఎలాంటి నష్టం లేదని, ప్రతిభను మెరుగుపర్చుకోని వారికి ఉద్వాసన తప్పదని తెలిపారు.

మరిన్ని వార్తలు