రేపటి నుంచి తాజా గోల్డ్ బాండ్ స్కీమ్

31 Aug, 2016 00:36 IST|Sakshi
రేపటి నుంచి తాజా గోల్డ్ బాండ్ స్కీమ్

వరుసలో ఐదవది...
9వ తేదీ వరకూ దరఖాస్తులు బాండ్ల జారీ తేదీ 23

న్యూఢిల్లీ: ఐదవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచీ ప్రారంభం కానుంది. దరఖాస్తుల దాఖలుకు గడువు సెప్టెంబర్ 9. బాండ్ల జారీ 23న జరుగుతుంది.  ఇప్పటి వరకూ 4 విడతల గోల్డ్ బాండ్ల జారీ జరిగింది. ఇందులో మూడవ విడత వరకూ జారీ అయిన బాండ్ల ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్‌లలో ఇప్పటికే ప్రారంభమయింది.  ఈ నెల 29వ తేదీనే మూడవ విడత బాండ్ల ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇక  సెప్టెంబర్ 23వ తేదీ జారీ అయ్యే బాండ్లతో కలుపుకుంటే... రెండు విడతల బాండ్ల ఎక్స్ఛేంజీల ట్రేడింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నమాట. 

 విధానం ఇదీ..: 2015 అక్టోబర్ 30న పసిడి బాండ్ల పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.  బాండ్లకు సంబంధించి తొలి పెట్టుబడిపై వార్షిక స్థిర వడ్డీరేటు 2.75 శాతం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఒక గ్రాము  నుంచి 500 గ్రాముల వరకూ విలువైన బాండ్ల కొనుగోలుకు వీలుంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తరవాత ఎగ్జిట్ ఆఫర్ ఉంటుంది. ఇన్వెస్టర్ దృష్టి ఫిజికల్ గోల్డ్ వైపు నుంచి మళ్లించడం ఈ పథకం లక్ష్యం. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), కొన్ని పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.  నాల్గవ విడత గోల్డ్ బాండ్ల జారీ ద్వారా ప్రభుత్వం రూ.919 కోట్లు సమీకరించింది. మొదటి మూడు విడతల్లో 4.9 టన్నుల పసిడికి సంబంధించి రూ.1,318 కోట్ల విలువైన పెట్టుబడులను సేకరించింది.

మరిన్ని వార్తలు