ఏడు రోజుల లాభాలకు బ్రేక్

21 Feb, 2015 02:04 IST|Sakshi
ఏడు రోజుల లాభాలకు బ్రేక్

- బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ
- సెన్సెక్స్ నష్టం 231 పాయింట్లు
- 62 పాయింట్ల నష్టంతో 8,834కు నిఫ్టీ
- మార్కెట్ అప్‌డేట్

బ్లూచిప్ షేర్లలో అమ్మకాలతో ఏడు  రోజుల స్టాక్ మార్కెట్ల లాభాలకు శుక్రవారం కళ్లెం పడింది. దీనికి తోడు వచ్చే వారం రానున్న బడ్జెట్ కారణంగా ట్రేడర్ల ముందు జాగ్రత్త కూడా  ప్రభావం చూపింది. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ, కొన్ని ఆయిల్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.
 
ఆర్‌ఐఎల్ 3 శాతం డౌన్
సెన్సెక్స్ గురువారం నాటి ముగింపుతో పోల్చితే శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైంది. 29,446 పాయింట్ల వద్ద ఆరంభమైన సెన్సెక్స్ 29,462, 29,178 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. చివరకు  231 పాయింట్లు నష్టపోయి 29,231 పాయంట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 8,834 పాయింట్ల వద్ద ముగిసింది. చమురు శాఖలో కీలక పత్రాలను చోరీ చేశారంటూ ఢిల్లీ పోలీసులు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగిని అదపులోకి తీసుకున్న కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3 శాతం పతనమైంది.
 
హెచ్‌డీఐఎల్ జోరు....
హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌డీఐఎల్) షేర్ ధర శుక్రవారం 7% పెరిగి 123 వద్ద ముగిసింది. 2013 జనవరి తర్వాత ఇదే అధిక స్థాయి. ఒక నెల కాలంలో ఈ షేర్ 58% పెరిగింది. ఈ కాలానికి సెన్సెక్స్ 1.3 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. విదేశీ ఇన్వెస్టర్లు బాగా ఆసక్తి చూపడం, క్యూ3లో కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండడం హెచ్‌డీఐఎల్ జోరుకు కారణాలని నిపుణులంటున్నారు.
 
స్పైస్‌జెట్ జూమ్..
స్పైస్‌జెట్‌లో కళానిధి మారన్ వాటాను మాజీ ప్రమోటర్ అజయ్ సింగ్ కొనుగోలు చేయడాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదించడంతో స్పైస్‌జెట్ షేర్ 20 శాతం వృద్ధి చెంది రూ.23.9 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు