90 శాతం కంపెనీల్లో తగ్గిన ఎఫ్‌ఐఐ వాటా!

29 May, 2020 16:19 IST|Sakshi

నాలుగో త్రైమాసికంలో దాదాపు 90 శాతం నిఫ్టీ కంపెనీల్లో విదేశీ మదుపరులు వాటాలు తగ్గించుకున్నాయి. బడ్జెట్‌ టెన్షన్స్‌, కరోనా కలకలం, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ఎఫ్‌ఐఐలు పోర్టుఫోలియోల్లో అమ్మకాలకు దిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ధోరణే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్షోభాల కారణంగా నిఫ్టీ 500లో విదేశీకంపెనీల వాటా ఐదేళ్ల కనిష్ఠాలకు దిగివచ్చిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిల్లో ఒకమోస్తరుగా కొనుగోళ్లు చేసిన ఎఫ్‌ఐఐలు మార్చిలో ఒక్కమారుగా రూ.1.2 లక్షల కోట్ల విలువైన అమ్మకాలకు దిగారు. దీంతో ఆ నెల సూచీలు భారీ పతనం చవిచూశాయి. మార్చి త్రైమాసికంలో ఎఫ్‌ఐఐల అమ్మకాలకు వ్యతిరేకంగా డీఐఐలు కొనుగోళ్లకు దిగాయి. ఈ త్రైమాసికంలో ఎఫ్‌ఐఐలు నిఫ్టీ 50లోని 78 శాతం కంపెనీల్లో వాటాలు పెంచుకున్నాయి. నిఫ్టీ 500 కంపెనీల్లో కూడా డీఐఐలు గణనీయంగా కొనుగోళ్లు జరిపాయి. దీంతో నిఫ్టీ 500లో ఎఫ్‌ఐఐ- డీఐఐ వాటా నిష్పత్తి మరింత క్షీణించింది. గత ఐదేళ్లలో ఈ నిష్పత్తి 2.2 ఉండగా మార్చిలో 1.4కు దిగివచ్చింది. 
ఇదే ధోరణి కొనసాగేనా?
కరోనా సంక్షోభ భయాలు చల్లారడం ఆధారంగా సూచీల్లో ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు పెరగడం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎకానమీ తిరిగి గాడిన పడడం, అంతర్జాతీయ పరిస్థితులు పాజిటివ్‌గా మారడంపై మార్కెట్‌ తదుపరి భవితవ్యం ఆధార పడి ఉంటుంది. క్యు2లో ఎకానమీ రికవరీ బాట పడితే ఇండియా వైపు తిరిగి విదేశీ మదుపరులు చూస్తారని నిపుణుల అంచనా. అయితే సమీప భవితవ్యంలో మాత్రం ఎఫ్‌ఐఐల అమ్మకాలే కొనసాగవచ్చని, మిడ్‌టర్మ్‌కు ఈ అమ్మకాలు నిలిచిపోవచ్చని ఎక్కువమంది భావిస్తున్నారు. పెద్దదేశాలు ప్రకటించిన ఉద్దీపనల కారణంగా పెరిగే లిక్విడిటీ నెమ్మదిగా భారతీయ మార్కెట్లోకి వస్తుందని, అందుకు సమయం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు