మాల్యా అప్పగింత : నేడే కీలక పరిణామం

31 Jul, 2018 11:09 IST|Sakshi
విజయ్‌ మాల్యా కేసులో తుది విచారణ

భారత బ్యాంక్‌లకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అతన్ని భారత్‌కు అప్పగించే కేసులో యూకే కోర్టులో జరుగుతున్న విచారణలో నేడే తుది ఘట్టం. మంగళవారం జరుగబోయే ఫైనల్‌ విచారణలో ఈ కేసు ముగింపు అంకానికి రాబోతుందని తెలుస్తోంది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ వద్ద చీఫ్‌ మెజిస్ట్రేట్‌ ముందు ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ రెండూ కూడా తమ తమ తుది వాదనలను వినిపించబోతున్నాయి. భారత్‌ తరఫున ది క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీసెస్‌(సీపీఎస్‌) ఈ కేసును వాదిస్తోంది. ఈ కేసుపై తుది తీర్పును యూకే కోర్టు సెప్టెంబర్‌లో వెల్లడించనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ కేసు తుది విచారణ ప్రారంభం కానుందని తెలిసింది. 

గత డిసెంబర్‌లోనే మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు తుది విచారణ చేపట్టాలని యూకే కోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు తుది విచారణలో కాస్త జాప్యం జరిగింది. ఈ కేసులో ఎక్కువగా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌, ఐడీబీఐ బ్యాంక్‌కు ఎగ్గొట్టిన రుణాలపై వాదన జరుగుతోంది. మొత్తం అన్ని భారత బ్యాంక్‌లకు కలిపి రూ.9900 కోట్ల రుణాలను మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ బాకీ పడింది. ఈ రుణాలన్నింటిన్నీ ఎగ్గొట్టి మాల్యా విదేశాలకు పారిపోయారు. మాల్యా 2016 మార్చి నుంచి బ్రిటన్‌లో లగ్జరీ జీవితం గడుపుతున్నారు. అతనిని తమకు అప్పగించాలంటూ భారత్ చేసుకున్న అభ్యర్థనపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్‌ చేశారు కూడా. ఆ అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై విచారణ ప్రారంభమైంది.

మరోవైపు మాల్యా భారత్‌కు వచ్చేందుకు సముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాల్యాపై పరారీ ఆర్థిక నేరగాడుగా ముద్ర వేయడంతోపాటు అతనికి చెందిన రూ.12,500 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనపర్చుకునేందుకు అనుమతివ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) ముంబైలోని ప్రత్యేక కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ కోసం వచ్చేనెల 27న ప్రత్యక్షంగా హాజరుకావాలని మాల్యాకు కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకాకుంటే కోర్టు మాల్యాను పరారీ ఆర్థిక నేరగాడుగా ప్రకటించడంతోపాటు ఆయన ఆస్తుల స్వాధీనానికి అనుమతిచ్చే అవకాశం ఉంది. అదే గనక జరిగితే మాల్యాకు దేశ, విదేశాల్లో ఉన్న ఆస్తులను దర్యాప్తు ఏజెన్సీ తక్షణమే స్వాధీనం చేసుకోనుంది. దాంతో దిగొచ్చిన మాల్యా.. విచారణకు ప్రత్యక్షంగా హాజరై తన గోడు వెళ్లబోసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు