-

ఏసీ అమ్మకాలు... కూల్!

25 Mar, 2014 01:24 IST|Sakshi
ఏసీ అమ్మకాలు... కూల్!

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల(ఏసీ) తయారీ కంపెనీలకు ఈ వేసవి కలిసిరానుంది. ఎండలు 20 రోజులు ఆలస్యంగా మొదలైనా అమ్మకాలు జోరందుకోవడంతో కంపెనీలు మార్కెట్లోకి సరఫరాలు పెంచుతున్నాయి. గతేడాది కంటే ఈ సీజన్‌లో 10 శాతం అధికంగా విక్రయాలు నమోదవుతాయన్న అంచనాలు మార్కెట్‌కు జోష్‌నిస్తోంది. అయితే కస్టమర్లకు ఊరటనిచ్చే అంశమేమంటే ఏసీల ధరలు ఈ వేసవిలో పెంచబోమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

 2014 బెటర్..
 దేశవ్యాప్తంగా 2012లో రూ.7,500 కోట్ల విలువైన 32 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. ముడిసరుకులు ఖరీదవడం, డాలరు గణనీయంగా బలపడడం తదితర కారణాలతో ఏసీల ధరలు 10 శాతం దాకా పెరగడంతో 2013లో మార్కెట్ పరిమాణం 31 లక్షలకే పరిమితమైంది. ప్రస్తుత సీజన్‌లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ముంబైతోపాటు పశ్చిమ ప్రాంతాల్లో మార్కెట్ గణనీయంగా పుంజుకుందని బ్లూస్టార్ రూమ్ ఏసీ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సి.పి.ముకుందన్ మీనన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాలో అమ్మకాలు జోరుగా ఉన్నాయని చెప్పారు. 2013తో పోలిస్తే ఏసీల ధరలు 10% వరకు పెరిగాయి. ప్రస్తుతానికి ధరలు ఇలాగే ఉంటాయని, మరింత పెరిగే అవకాశమే లేదన్నారు.

 50 శాతం వాటా 3 స్టార్‌దే..
 ఏసీల విపణిలో సగం వాటా 3 స్టార్ ఏసీలదే. 1-1.5 టన్నుల ఏసీలు రూ.20 వేల నుంచి లభిస్తున్నాయి. 5 స్టార్ ఏసీలు 15 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. వీటి ధరలు రూ.28 వేల నుంచి ప్రారంభం. ఈ ఏడాది మొత్తం మార్కెట్లో విండో ఏసీలు 7 లక్షల యూనిట్లు, స్ప్లిట్ ఏసీలు 27 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. 5 స్టార్ ఏసీల కంటే తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేసే ఇన్వర్టర్ ఏసీలు 3 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి.

2015లో ఈ విభాగం రెండింతలవుతుందని బ్లూస్టార్ అంటోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ప్రమాణాలకుతోడు సాంకేతికంగా ఇవి ఆధునికమైనవి. సాధారణంగానే వీటి ధరలు 5 స్టార్ కంటే 30% ఎక్కువ. కస్టమర్లకు ప్రభు త్వమే నేరుగా సబ్సిడీ ఇస్తే ఇన్వర్టర్ ఏసీల అమ్మకాలు మరింత పెరుగుతాయని ముకుందన్ అభిప్రాయపడ్డారు. ఉపకరణం వినియోగించే విద్యుత్ ఆధారంగా బీఈఈ స్టార్ రేటింగ్ ఇస్తోంది. 5 స్టార్ కంటే 3 స్టార్ ఏసీతో కరంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. కాకపోతే ధర తక్కువగా వుండటం వల్ల 3 స్టార్ ఏసీలకు డిమాండ్ ఎక్కువ.

 రంగుల ఏసీలు కావాలి..
 రంగు రంగుల ఏసీలను యువతరం కోరుకుంటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎరుపు, పసిడి, వెండి వర్ణం రంగులకు డిమాండ్ జోరుగా ఉంటోంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 25%. కంపెనీలు సైతం తమ ఉత్పాదనల్లో ఈ రంగులను తప్పనిసరిగా ప్రవేశపెడుతున్నాయి. తెలుపు రంగు ఏసీలు 75%గా ఉన్నాయి. మొత ్తంగా ఈ ఏడాది 34 లక్షల ఏసీలు అమ్ముడవుతాయని షార్ప్ ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కిషాలయ్ రే వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2.7 లక్షల యూనిట్లు నమోదు కావొచ్చు. వారం రోజుల్లో 1,500 ఏసీలను విక్రయించామని, మార్కెట్ పుంజుకుంటుందని టీఎంసీ బేగంపేట షోరూం మేనేజర్ కె.శ్రీనివాస్ తెలిపారు. భారత ఏసీల రంగంలో వోల్టాస్, ఎల్‌జీ, ప్యానాసోనిక్‌లు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. బ్లూస్టార్, హిటాచీ 4వ స్థానం, దైకిన్, శాంసంగ్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. 20 ప్రముఖ బ్రాండ్ల వాటా 96%గా ఉంది.

మరిన్ని వార్తలు