రేట్ల కోతకు సమయమిదే

23 May, 2015 00:32 IST|Sakshi
రేట్ల కోతకు సమయమిదే

- దీన స్థితిలో పారిశ్రామిక వృద్ధి
- తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం
- కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: 
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతంత మాత్రంగా ఉన్న పారిశ్రామిక వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించడానికి ఇది సరైన సమయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. జూన్ 2న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైట్లీ పాల్గొన్నారు.

పాలసీ రేట్లను తగ్గించాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. దీనిపై తన అభిప్రాయం అందరికీ తెలుసని, ఇది సరైన సమయమని పేర్కొన్నారు. 2015లో ఆర్‌బీఐ ఇప్పటిదాకా రెండు సార్లు పాలసీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం రెపో రేటు (ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు) 7.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తగ్గడం, పారిశ్రామికోత్పత్తి ఆశించిన దానికంటే తక్కువగా ఉండటం వంటి అంశాల కారణంగా ఆర్‌బీఐ పాలసీని కాస్త సరళతరంగా చేసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టమైన 4.87 శాతానికి దిగి రాగా, మార్చిలో పారిశ్రామికోత్పత్తి అయిదు నెలల కనిష్టమైన 2.1 శాతానికి పడిపోయింది. ఈ పరిణామాలతో జూన్ 2న ఆర్‌బీఐ రెపో రేటును కనీసం పావు శాతం తగ్గించవచ్చని భావిస్తున్నట్లు ఎస్‌బీఐ ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది.

మొండి బకాయిలపై ఇప్పుడే ఏమీ చెప్పలేం..
బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో మొండి బకాయిల (ఎన్‌పీఏలు) స్థాయి  డిసెంబర్ త్రైమాసికంలో 5.64% స్థాయికి ఎగియగా, మార్చి త్రైమాసికంలో ఇవి 5.2%కి తగ్గిందని జైట్లీ తెలిపారు. అయినప్పటికీ.. ఇది కూడా చాలా ఎక్కువేనని పేర్కొన్నారు. గత త్రైమాసికంలో ఇవి తగ్గినట్లుగా కనిపిస్తున్నప్పటికీ, పరిస్థితులు పూర్తిగా మెరుగుపడుతున్నట్లుగా ఇప్పుడే భావించలేమని జైట్లీ వ్యాఖ్యానించారు. ఎకానమీని వృద్ధి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నంలో కొన్ని సంకేతాలు అస్పష్టంగానే ఉంటాయన్నారు.

మరిన్ని వార్తలు