పరిశ్రమ వర్గాలతో ప్రి–బడ్జెట్‌ సమావేశాలు

16 Dec, 2019 03:18 IST|Sakshi

నేటి నుంచి ప్రారంభం

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం (నేడు) నుంచి పరిశ్రమవర్గాలు, రైతు సంఘాలు, ఆర్థికవేత్తలు మొదలైనవారితో సమావేశం కానున్నారు. వినియోగానికి, వృద్ధికి ఊతమిచ్చేందుకు తీసుకోతగిన చర్యల గురించి చర్చించనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే ప్రి–బడ్జెట్‌ సమావేశాలు డిసెంబర్‌ 23 దాకా కొనసాగుతాయని, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం నాడు స్టార్టప్స్, ఫిన్‌టెక్, డిజిటల్‌ రంగ సంస్థలు, ఆర్థిక రంగం.. క్యాపిటల్‌ మార్కెట్‌ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సమావేశమవుతారు.

వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు, ప్రైవేట్‌ పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు, వృద్ధికి ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యల గురించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. పరిశ్రమల సమాఖ్యలతో డిసెంబర్‌ 19న సమావేశమవుతారు. 2019–20 రెండో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో.. రాబోయే బడ్జెట్‌లో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే చర్యలపై మరింత దృష్టి పెట్టవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే కార్పొరేట్‌ ట్యాక్స్‌లను గణనీయంగా తగ్గించినందున.. వేతనజీవులకు సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లపరంగా ఊరటనిచ్చే చర్యలేమైనా ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వస్తువులు, సేవలకు డిమాండ్‌ పెంచే విధంగా ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి. అలాగే, డిడక్షన్‌ పరిమితులను కూడా ప్రస్తుత రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచిన పక్షంలో.. పెట్టుబడులకు ఊతం లభించగలదని ఆశిస్తున్నాయి.

మరిన్ని వార్తలు