బ్యాంకింగ్‌ భవిష్యత్తుకు ఐడియాలివ్వండి 

17 Aug, 2019 08:37 IST|Sakshi

ప్రభుత్వరంగ బ్యాంకులను కోరిన కేంద్ర ఆర్థిక శాఖ 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ ఓ వినూత్న ప్రయత్నానికి బీజం వేసింది. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా... దీన్ని సాధించేందుకు గాను బ్యాంకింగ్‌ రంగాన్ని గాడిలో పెట్టాలని భావించింది. ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ నెల పాటు బ్రాంచ్‌ల స్థాయిలో అధికారులతో సంప్రదింపుల ప్రక్రియను చేపట్టి.. వారి సలహాలు స్వీకరించాలని కోరింది. శనివారాల్లో దీన్ని చేపట్టాలని వారిచ్చిన సూచనలను, బ్యాంకింగ్‌ రంగ భవిష్యత్తు వృద్ధికి రోడ్‌మ్యాప్‌ రూపకల్పనలో వినియోగించాలని సూచించింది. దిగువ స్థాయి నుంచి ఈ సంప్రదింపుల ప్రక్రియ ఉంటుందని, బ్రాంచ్‌ల స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరుగుతుందని ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లకు పంపిన లేఖలో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. తొలుత బ్రాంచ్‌ లేదా ప్రాంతీయ స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సలహాల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. అనంతరం, ఢిల్లీలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశం ఉంటుంది. 2024–25 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో కీలక భాగస్వాములైన ప్రభుత్వరంగ బ్యాంకుల పాత్రను గుర్తించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలుస్తోంది.   
 

మరిన్ని వార్తలు