ఆర్‌బీఐ వివాదం : కేంద్రం ప్రకటన

31 Oct, 2018 13:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నెలకొన్న వివాదం నేపథ్యంలో  కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.  ప్రభుత్వం ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని గౌరవిస్తుందని వెల్లడించింది. దాని విలువను మరింత పెంచుతుందని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ చట్టం పరిధిలో  బ్యాంకు స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపింది.

అలాగే ఆర్‌బీఐ ఐనా, ప్రభుత్వమైనా ప్రజా ప్రయోజనాలు, దేశ ఆర్థికవ్యవస్థ అవసరాల నిమిత్తం వ్యవహరించాల్సి ఉందని  ఫైనాన్స్‌ మినిస్ట్రీ తన ప్రకటనలో తెలిపింది. దీనికోసం ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య పలు అంశాలపై విస్తృతమైన సంప్రదింపులు,   చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతాయి.  ఈ విషయాలను భారత ప్రభుత్వం ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. తీసుకున్న తుది నిర్ణయాలు మాత్రమే తెలియజేస్తుంది. ఈ సాంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

కాగా దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థను నియంత్రించే అధికారిక సంస్థ రిజర్వ్ బ్యాంక్‌(ఆర్‌బీఐ)కు తగిన స్వేచ్చలేదంటూ సాక్షాత్తూ డిప్యూటీ గవర్నర్‌ అసంతృప్తి,   దీనికి  ప్రతిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌  జైట్లీ తీవ్ర వ్యాఖ్యలు  ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌  రాజీనామా చేయవచ్చే వార్తలు వ్యాపించాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 ద్వారా ఆర్‌బీఐ కార్యకలాపాల్లో ప్రభుత్వం చోక్యం చేసుకోనుందని, ఈ నేపథ్యంలో గవర్నర్‌ తప్పుకునే  అవకాశాలున్నాయని  మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి.
 

మరిన్ని వార్తలు