వచ్చే నెల బీహెచ్‌ఈఎల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్

19 Mar, 2015 01:35 IST|Sakshi
వచ్చే నెల బీహెచ్‌ఈఎల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) కోసం ప్రభుత్వం కంపెనీల జాబితాను సిద్ధం చేసింది. దీని ప్రకారం ఏప్రిల్‌లో ముందుగా బీహెచ్‌ఈఎల్‌లో వాటాలు విక్రయించనుంది. తద్వారా రూ. 3,200 కోట్లు రాగలవని అంచనా వేస్తోంది. ఇప్పటికే బీహెచ్‌ఈఎల్‌లో వాటాల విక్రయానికి సంబంధించి లండన్, సింగపూర్, హాం కాంగ్‌లలో డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం రోడ్‌షోలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం కంపెనీ షేరు ధర సుమారు రూ. 260 చొప్పున చూస్తే 12.23 కోట్ల షేర్లను విక్రయిస్తే రూ. 3,200 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు వివరించాయి. ప్రభుత్వానికి బీహెచ్‌ఈఎల్‌లో 63.06 శాతం వాటాలు ఉన్నాయి. అటు ఎన్‌ఎండీసీ, నాల్కో, ఐవోసీ తదితర కంపెనీల్లో తలో పది శాతం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2015-16లో పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 69,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. వివిధ పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల అమ్మకం ద్వారా రూ. 41,000 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ. 28,500 కోట్లు రాబట్టాలని యోచిస్తోంది.

మరిన్ని వార్తలు