ప్రభుత్వ సంస్థల్లో షేర్ల బైబ్యాక్‌ 

8 Sep, 2018 01:15 IST|Sakshi

11 సంస్థలను షార్ట్‌ లిస్ట్‌  చేసిన ఆర్థిక శాఖ

లిస్టులో కోల్‌ ఇండియా,  ఎన్టీపీసీ, నాల్కో తదితర సంస్థలు  

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్లు బైబ్యాక్‌ చేసేందుకు దాదాపు పదకొండు ప్రభుత్వ రంగ సంస్థలను (సీపీఎస్‌ఈ) కేంద్ర ఆర్థిక శాఖ షార్ట్‌లిస్ట్‌ చేసింది. కోల్‌ ఇండియా, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్‌ఎండీసీ, ఎన్‌ఎల్‌సీ, భెల్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌బీసీసీ, ఎస్‌జేవీఎన్, కేఐవోసీఎల్, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఇటీవలే ఆయా సంస్థలతో చర్చించిన అనంతరం ఈ లిస్టును రూపొందించింది. అయితే, ఆయా సంస్థల వ్యాపార ప్రణాళికలను బట్టి చూస్తే.. అన్ని సంస్థలు 2018–19లోనే షేర్ల బైబ్యాక్‌ చేయలేకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

2016 మే 27 నాటి పెట్టుబడుల పునర్‌వ్యవస్థీకరణ మార్గదర్శకాలకి ప్రకారం కనీసం రూ. 2,000 కోట్ల నికర విలువ, రూ. 1,000 కోట్ల పైగా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉన్న సీపీఎస్‌ఈలు తప్పనిసరిగా షేర్ల బైబ్యాక్‌ చేపట్టాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా షేర్లు బైబ్యాక్‌ చేయాలంటూ ఈ సీపీఎస్‌ఈలకు కేంద్రం సూచించింది. కంపెనీ సంపదలో కొంత భాగాన్ని షేర్‌హోల్డర్లకు బదలాయించేందుకు, షేర్లు ధరలకూ ఊతం ఇచ్చేందుకు సంస్థలు.. షేర్ల బైబ్యాక్‌ చేపడుతుంటాయి. ఇలా కొన్న షేర్లను రద్దు చేయడం లేదా ట్రెజరీ స్టాక్‌ కింద వర్గీకరించడం చేస్తాయి. చలామణీలో ఉన్న షేర్లు తగ్గడం వల్ల షేరువారీ ఆర్జన మరింత పెరిగి ఆయా సంస్థల వ్యాపారం ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు