సంపద సృష్టిపై యువతరం ఆసక్తి

17 Mar, 2018 02:37 IST|Sakshi

ఆదాయంలో 11 శాతం పొదుపు

ఫిన్‌టెక్‌ సంస్థ సేవ్‌అభీ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: సంపద సృష్టికి తోడ్పడేలా పెట్టుబడులు పెట్టడంపై యువతరం ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా నెలకు రూ. 25,000 కన్నా తక్కువగా ఆర్జిస్తున్న మిలీనియల్స్‌ (22–30 ఏళ్ల మధ్య వయస్సు వారు).. తమ ఆదాయంలో 11 శాతాన్ని పొదుపు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థ సేవ్‌అభీ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

మరోవైపు నెలకు రూ. 25,000–రూ. 50,000 మధ్య ఆదాయం అందుకుంటున్న మిలీనియల్స్‌ 7.9 శాతం, రూ. 50,000కు మించి ఆదాయం ఉంటున్న మిలీనియల్స్‌ 8.1 శాతం మేర పొదుపు చేస్తున్నారు. ఈ మూడు వర్గాలకు చెందిన వారు అత్యధికంగా ఇళ్లు, కిరాయిలపై ఖర్చు చేస్తున్నారు. మొదటి కేటగిరీ 35 శాతం, రెండో వర్గం 21.5 శాతం, మూడో వర్గం 33.5 శాతం ఖర్చు చేస్తున్నారు.

ఇక ఆ తర్వాత డైనింగ్‌ మొదలైన వాటిపై 12.3 శాతం, 21 శాతం, 11 శాతం మేర వ్యయం చేస్తున్నారు. మొత్తం 5,000 మంది మిలీనియల్స్‌ గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. మిలీనియల్స్‌ ఇన్వెస్టర్స్‌లో 97 శాతం మంది పురుషులే ఉన్నారు. యువతరం ఎంత సేపూ తాత్కాలికమైన వాటివైపే మొగ్గు చూపుతుందని, భవిష్యత్‌ కోసం పొదుపు పట్టించుకోదని ఉన్న అపోహలను పోగొట్టేలా సర్వే ఫలితాలు ఉన్నాయని సేవ్‌అభీ వ్యవస్థాపకుడు ప్రియాంక్‌ బర్త్‌వాల్‌ పేర్కొన్నారు. ఆటోమేటిక్‌ పొదుపును ప్రోత్సహించే దిశగా సేవ్‌అభీ సంస్థ తాజాగా సేవ్‌ ది చేంజ్‌ పేరిట యాప్‌ను రూపొందించింది.

మరిన్ని వార్తలు