-

ఫిన్‌టెక్‌.. ‘కంటెంట్‌’ మంత్రం!

21 Aug, 2019 05:26 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్లు, ఫండ్స్‌పై విస్తృత సమాచారం

చార్ట్‌లు, గ్రాఫ్‌లు, వీడియో, టెక్ట్స్‌ సందేశాలు

అస్థిరతల సమయాల్లో నడుచుకోవడంపై అవగాహన

పెట్టుబడులపై సూచనలు

తద్వారా ఇన్వెస్టర్లు దూరం కాకుండా చర్యలు

న్యూఢిల్లీ: స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో పెట్టుబడుల సేవలు అందిస్తున్న నవతరం ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లు.. అల్లకల్లోల సమయాల్లో కస్టమర్లను కాపాడుకునేందుకు, వారు మార్కెట్లకు దూరంగా వెళ్లకుండా ఉండేందుకు పలు రకాల సేవలతో ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకమైన కంటెంట్‌ కూడా ఒకటి. స్టాక్‌ మార్కెట్లు దీర్ఘకాలంగా తీవ్ర అస్థిరతల్లో ఉండడంతో కంపెనీలు ఈ తరహా చర్యల దిశగా అడుగులు వేస్తున్నాయి. జీరోధా, గ్రోవ్‌ వంటి సంస్థలు బ్లాగ్‌ పోస్ట్‌లు, సోషల్‌ మీడియా సందేశాలు, మార్కెట్లపై విజ్ఞానాన్ని పెంచే వినూత్నమైన వీడియోలను అందిస్తున్నాయి. వీటి ద్వారా ఆటుపోట్లతో కూడిన మార్కెట్లలో పెట్టుబడి అవకాశాల గురించి తెలియజేస్తూ ఇన్వెస్టర్లు తగిన నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రోత్సహిస్తున్నాయి.

జీరోధా సేవలు...
‘‘అస్థిరతలతో కూడిన మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవర్తన అందరిదీ ఒకే విధంగా ఉంటుంది. కనుక గతంలో ఇన్వెస్టర్లు ఏ విధంగా స్పందించారన్న విషయంపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. గ్రాఫ్‌లు, చార్ట్‌ల సాయంతో ఈ తరహా మార్కెట్‌ పరిస్థితుల్లో ఉన్న అవకాశాల గురించి వివరిస్తున్నాం’’ అని జీరోధా సంస్థలో ఈక్విటీ పరిశోధన విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కార్తీక్‌ రంగప్ప తెలిపారు. జీరోధా సంస్థ వర్సిటీ, ట్రేడింగ్‌క్యుఎన్‌ఏ, జెడ్‌కనెక్ట్‌ అనే మూడు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇన్వెస్టర్ల ఆందోళనలు, ప్రశ్నలకు వీటి ద్వారా సమాధానాలు ఇస్తోంది.

ఇప్పటి వరకు 46,000 విచారణలను ఈ సంస్థ స్వీకరించింది. ఆప్షన్ల ట్రేడింగ్, పన్నులపై ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. రోజూ 20–40 వరకు విచారణలు వస్తున్నాయని రంగప్ప పేర్కొన్నారు. ఫలానా స్టాక్‌ ఫలానా ధర ఉన్నప్పుడు ఇన్వెస్టర్‌ను అప్రమత్తం చేసేందుకు ‘సెట్‌ యాన్‌ అలర్ట్‌’ ఆప్షన్, స్టాక్‌ రిపోర్టులు, టెక్నికల్స్, ఫండమెంటల్స్, చార్ట్‌లను జెరోదా ఆఫర్‌ చేస్తోంది. వీటిని జీరోధా కైట్‌ యాప్, పోర్టల్‌ నుంచి సులభంగా పొందొచ్చు.

ఈటీ మనీ...
అస్థిరతల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించే ప్రయత్నాన్ని ఈటీ మనీ చేస్తోంది. ‘‘వాస్తవ గణాంకాలు, సమాచారం ఆధారంగా అస్థిరతల సమయాల్లో ఎలా నడుచుకోవాలన్న దానిపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ మ్యూచువల్‌ ఫండ్‌కు సంబంధించి రిపోర్టు కార్డులతో సులభమైన ఇంగ్లిష్‌లో తెలియజేస్తున్నాం’’ అని ఈటీ మనీ సీఈవో ముకేష్‌ కర్లా తెలిపారు. టైమ్స్‌ గ్రూపులో భాగమైన టైమ్స్‌ ఇంటర్నెట్‌కు చెందిన అనుబంధ కంపెనీయే ఈటీ మనీ.

ఇతర సంస్థలూ...
22 లక్షల యూజర్ల బేస్‌ కలిగిన గ్రోవ్‌ సంస్థ వీడియో కంటెంట్‌ను ఇన్వెస్టర్లకు అందిస్తోంది. ‘‘వీడియో, టెక్ట్స్‌ కోసం 12 మందితో కూడిన కంటెంట్‌ బృందం మాకు ఉంది. పెట్టుబడుల అంశాలపై మాట్లాడాలంటూ పరిశ్రమకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నాం. వీడియోలు చాలా సులభంగా, తక్కువ అంశాలతో అవగాహన కల్పించే విధంగా ఉండేలా చూస్తున్నాం’’ అని గ్రోవ్‌ సీఈవో హర్‌‡్షజైన్‌ వెల్లడించారు. గ్రోవ్‌ యూట్యూబ్‌ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 5,000 నుంచి 31,000కు పెరగ్గా, ఒక్కో వీడియోకు గతంలో 1,000 వ్యూస్‌ రాగా, అవి 10,000కు పెరిగాయి.

పేటీఎం మనీ సైతం ముగ్గురు సభ్యుల బృందంతో యూ జర్లపై మార్కెట్‌ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరహా సందేశాలు కస్టమర్లను సర్దుకునేలా చేస్తాయన్నారు పేటీఎం మనీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ జాదవ్‌. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రపంచంలో యూజర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కొత్తేమీ కాదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడాన్ని సెబీ తప్పనిసరి కూడా చేసింది. అయితే, చిన్న పట్టణాల నుంచీ ఇన్వెస్టర్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా కార్యక్రమాల అవసరం ఎంతో ఉందంటున్నారు నిపుణులు.

మరిన్ని వార్తలు