20 ఎఫ్‌డీఐలకు గ్రీన్ సిగ్నల్

20 Nov, 2013 00:37 IST|Sakshi
20 ఎఫ్‌డీఐలకు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ:  పూర్తిస్థాయి విమానయాన సర్వీసులను ప్రారంభించేందుకు వీలుగా టాటా సన్స్‌తో జత కట్టిన సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తోపాటు 20 ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విదేశీ పెట్టుబడుల మొత్తం విలువ రూ. 916 కోట్లు. గత నెల చివర్లో సమావేశమైన ఎఫ్‌ఐపీబీ ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. వీటిలో సింగపూర్ ఎయిర్‌లైన్ పెట్టుబడి విలువ రూ. 303.2 కోట్లుకాగా, రూ. 179.43 కోట్ల రెలిగేర్ ఎంటర్‌ప్రెజైస్  ప్రతిపాదన కూడా ఉంది.

పెట్టుబడి సలహా సర్వీసులు, ఆర్థిక సేవలతోపాటు ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో పెట్టుబడులకు రెలిగేర్ ఈ నిధులను వినియోగించనుంది. ఈ బాటలో ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఏర్పాటుకు జేఎం ఫైనాన్షియల్(రూ. 22.19 కోట్లు), ఫార్మా రంగ పెట్టుబడులకు పెర్రిగో ఏపీఐ ఇండియా(రూ. 130 కోట్లు) చేసిన ప్రతిపాదనలకు అనుమతి లభించింది. కాగా, రూ. 1,400 కోట్ల విలువైన ఫెడరల్ బ్యాంక్ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించింది. బ్యాంక్‌లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74%కి పెంచేందుకు అనుమతి కోరింది. డీఎల్‌ఎఫ్ లిమిట్‌లెస్ డెవలపర్స్, సింగ్‌టెల్ గ్లోబల్ ఇండియా ప్రతిపాదనలపై ఏ నిర్ణయాన్నీ ప్రకటించలేదు.
 

మరిన్ని వార్తలు