భారత్‌లో తొలి 5జీ లైవ్‌ వీడియో కాల్‌

16 Oct, 2019 01:41 IST|Sakshi

క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో ప్రదర్శించిన ఎరిక్సన్‌

న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్‌ 5జీ లైవ్‌ వీడియో కాల్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రదర్శించింది. ఇది భారత్‌లో తొలి 5జీ వీడియో కాల్‌ అని, క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్‌ హెడ్‌(సౌత్‌ ఈస్ట్‌ ఏషియా, ఓషియానియా, ఇండియా) నున్‌జో మిర్టిల్లో చెప్పారు. 5జీ సర్వీస్‌లు మిల్లీమీటర్‌వేవ్‌(ఎమ్‌ఎమ్‌వేవ్‌–28 గిగాహెట్జ్, 38 గిగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ బాండ్స్‌) స్పెక్ట్రమ్‌ ద్వారా అందుతాయని వివరించారు. 5జీ, 4జీ మొబైల్‌నెట్‌వర్క్స్‌కు ఎమ్‌ఎమ్‌వేవ్‌ స్పెక్ట్రమ్‌ కీలకమైనదని పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2019లో ఆయన మాట్లాడారు.

వచ్చే ఏడాది నుంచి 5జీ ఫోన్లు.... 
ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ), మెషీన్‌ టు మెషీన్‌ కమ్యూనికేషన్స్‌వంటి తాజా టెక్నాలజీలకు 5జీ కీలకం కానున్నదని మిర్టిల్లో పేర్కొన్నారు. 5జీ కారణంగా భారత్‌లో కొత్త అవకాశాలు అందివస్తాయని వివరించారు. వచ్చే ఏడాది నుంచి 5జీ టెక్నాలజీని సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరగనున్నాయని క్వాల్‌కామ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ రాజెన్‌ వగాడియా పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ స్పీడ్‌ అధికంగా ఉండే 5జీ సర్వీస్‌లు భారత్‌లో ఇంకా ఆరంభం కాలేదు. ఈ సర్వీసులు ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియాల్లో లభిస్తున్నాయి. 5జీ సర్వీసులకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వేలం వేయనున్నామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు