రైతు రుణాలే ప్రాధాన్యం

27 Sep, 2016 08:32 IST|Sakshi
రైతు రుణాలే ప్రాధాన్యం

పెందుర్తి, భోగాపురంలో విజయా బ్యాంకు కొత్త శాఖలు

 విశాఖపట్నం: విజయా బ్యాంక్ కొత్తగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏర్పాటు చేసిన రెండు బ్రాంచ్‌లను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్.రామారావు సోమవారం ప్రారంభించారు.  విశాఖ జిల్లా పెందుర్తి, విజయనగరం జిల్లా భోగాపురంలోని ఈ శాఖల్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతుల అవసరాలకు తగ్గట్టు రుణ సదుపాయాలు కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం తమ బ్యాంకు ప్రధాన ఉద్దేశమన్నారు.

గ్రామీణుల కోసం, ముఖ్యంగా రైతు కుటుంబాల అభివృద్ధి కోసమే 1931లో బ్యాంకును స్థాపించారని చెప్పారు. బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 189 బ్రాంచీలు, 162 ఏటీఎం కేంద్రాలున్నాయి. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రూ.8,847 కోట్ల వ్యాపారం చేసినట్లు చెప్పారు. 21 లక్షల మంది ఖాతాదారులను 3 ప్రధాన సాంఘిక సంక్షేమ పథకాల్లో (ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన) చేర్చినట్లు చెప్పారు. సామాజిక బాధ్యతగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు పి.శ్రీనివాసరెడ్డి, వై.మురళీకృష్ణ, బి.రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు