రియల్టీ.. రివ్వు రివ్వు!!

3 May, 2019 00:49 IST|Sakshi

జనవరి–మార్చిలో 7 శాతం పెరిగిన పెట్టుబడులు

విలువ పరంగా రూ.17,682 కోట్లు

విదేశీ నిధుల్లో ఏకంగా 81% వృద్ధి

కుష్‌మన్, వేక్‌ఫీల్డ్‌ నివేదికలో వెల్లడి  

న్యూఢిల్లీ: భారత రియల్‌ ఎస్టేట్‌ రంగం ఈ ఏడాది జనవరి– మార్చి మధ్య భారీ పెట్టుబడులను ఆకర్షించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పెట్టుబడులు రూ.16,528 కోట్ల నుంచి రూ.17,682 కోట్లకు... అంటే 7 శాతం పెరిగాయి. దీన్లో విదేశీ పెట్టుబడులే ఏకంగా 81 శాతం పెరిగి రూ.6,260 కోట్ల నుంచి రూ.11,338 కోట్లకు చేరినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ– కుష్‌మన్‌– వేక్‌ఫీల్డ్‌ (సీడబ్ల్యూ) తన తాజా నివేదికలో తెలియజేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... 

►కమర్షియల్‌ అసెట్స్‌లోకి విదేశీ పెట్టుబడులు భారీగా రావడం ఈ రంగానికి కలిసొచ్చింది.  
►ఆఫీస్, రిటైల్‌ విభాగాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించాయి.  
►గోడౌన్లు, లాజిస్టిక్స్‌ విభాగాలూ ఇన్వెస్టర్లకు చక్కటి అవకాశాలు కల్పించాయి. 
►విజయవంతమైన మొట్టమొదటి రీట్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌) స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ ఈ రంగానికి మున్ముందు సానుకూలంగా ఉండనుంది.
►అయితే హౌసింగ్‌ రంగానికి పెట్టుబడులు 57 శాతం తగ్గాయి. ఈ విలువ రూ.8,518 కోట్ల నుంచి రూ.3,697 కోట్లకు తగ్గింది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నుంచి ద్రవ్య సరఫరాల పరంగా వచ్చిన సమస్యలు ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. నిజానికి గడచిన నాలుగేళ్లుగా ఈ విభాగంలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) ఇబ్బందులున్నాయి.  
► ఆఫీస్‌ ప్రాపర్టీల్లో పెట్టుబడి విలువ రూ.6,100 కోట్ల నుంచి రూ.7,925 కోట్లకు చేరింది.  
► ఆతిథ్య రంగానికి సంబంధించి రియల్టీ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి రూ.1,200 కోట్ల నుంచి రూ.3,950 కోట్లకు ఎగశాయి.  
► రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌లోకి పెట్టుబడులు రూ. 250 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు ఎగశాయి.  
►పారిశ్రామిక రంగానికి సంబంధించి (వేర్‌హౌస్, లాజిస్టిక్స్‌) రంగంలో పెట్టుబడులు రూ.350 కోట్ల నుంచి రూ.760 కోట్లకు చేరాయి.

స్నేహపూర్వక పెట్టుబడి విధానాలు
భారత్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం పట్ల సానుకూల స్పందన వస్తోందనడానికి జనవరి–మార్చి గణాంకాలను పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఇక్కడ విదేశీ ఇన్వెస్టర్ల పాత్రను ప్రస్తావించుకోవాలి. దేశంలో నెలకొన్న పారదర్శక, స్నేహపూర్వక పెట్టుబడుల విధానాలు దీనికి కారణమని భావించవచ్చు. 
– అన్షుజైన్, సీడబ్ల్యూ ఇండియా కంట్రీ హెడ్‌   
 

First quarter investments in Indian Realty at decade-high of $2.5 billion

మరిన్ని వార్తలు