తొలి జీవితం అడుగులు ఇలా..

28 Sep, 2014 03:18 IST|Sakshi
తొలి జీవితం అడుగులు ఇలా..

పెళ్లి... వ్యక్తి జీవితంలో సంతోషం, సౌభాగ్యంతో పాటు ఆశావహ దృక్పథాన్నీ తీసుకువస్తుంది. ఇదే సమయంలో మూడుముళ్లతో ఒక్కటైన జంట కాలక్రమంలో ఆర్థిక ఒడిదుడుకులను, పలు బాధ్యతలను ఎదుర్కోక తప్పదు.  జీవిత భాగస్వాములుగా పరస్పర విశ్వాసంతో ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటూ జాగ్రత్తగా బతుకు బండిని నడుపుకుంటూ రావాల్సిందే. పిల్లలు.. వారి చదువులు.. జీవిత లక్ష్యాలు.. పదవీ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలను ఎదుర్కొనడం..  ఇవన్నీ జీవితంలో ఒక భాగమైపోతాయి. వీటన్నింటితో ఒక వివాహం విజయవంతమై... సమాజంలో ఆదర్శప్రాయమవుతుంది. ప్రతి వివాహ బంధం ఈ స్థాయికి చేరుకునే బాటలో అనుసరించాల్సిన ఐదు ఆర్థిక సూత్రాలు...
 

పెళ్లైన కొత్తలో ఆర్థిక బాధ్యతలు తక్కువగా ఉంటాయి కాబట్టి  ఆర్థిక ప్రణాళికను రచించి అమలు పర్చడానికి ఇదే సరైన సమయం. నవ దంపతులు ఆర్థిక ప్రణాళికలో ఈ ఐదు అంశాలను మరచిపోకూడదు.

 పరస్పరం మాట్లాడుకోవాలి...
 భార్యాభర్తలు ఇరువురు తమ జీవన ప్రయాణానికి ముందు ఒకరికొకరు తమ ఆర్థిక అవసరాలు, రాబడులు, వ్యయాల వంటి అంశాలపై చర్చించుకోవాలి. పరస్పరం అర్థం చేసుకోవాలి. తమ జీవితానికి అనుగుణమైన ప్రణాళికలు వేసుకోవాలి.  ఈ ప్రణాళికలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల ప్రాతిపదికన, భవిష్యత్‌కు భరోసాను ఇచ్చేవిగా ఉండాలి.  రుణాలు, బిల్లుల చెల్లింపులు, ఇంటి అద్దెలు, పెట్టుబడులు, నెలవారీ ఖర్చులు... ఇత్యాధి అంశాలన్నీ మీ చర్చల్లో భాగం కావాలి.  

 జీవిత బీమా ధీమా కావాలి...
భవిష్యత్ భద్రత, ఆర్థిక అవసరాల నుంచి అనుకోని అవాంతరాలను ఎదుర్కొనేంత వరకూ పలు దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఒక జీవిత బీమా పాలసీ తీసుకోవడం ఎంతో అవసరం. భార్యాభర్తలు వారివారి జీవిత అవసరాలకు అనుగుణంగా ఒక బీమా పాలసీని ఎంచుకోవాలి. వివాహానికి ముందే పాలసీ ఉంటే... దానిని అనంతరం  మీ తాజా అవసరాలకు, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా మలచుకోవాలి. ఆ మేరకు పాలసీ ప్రయోజనాలను పెంచుకోవాలి. రైడర్లను వినియోగించుకోవాలి. ఆర్థిక అవసరాలు ఇక్కడ ముఖ్యంకాదు. కొన్ని దురదృష్ట ఘటనలను సైతం ఎదుర్కొనేలా జీవిత బీమా పాలసీలు దోహదపడతాయన్నది ఇక్కడ గమనించాల్సిన అవసరం.
 
ఆరోగ్య బీమా కూడా అవసరమే..

 ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి నేడు నూటికి నూరుపాళ్లూ నిజం. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా... ఎంతటి వారైనా ఈ సమస్యను ఎదుర్కొనక తప్పదు. ఇలాంటి సమయంలో ఆరోగ్య బీమా ప్రణాళిక ఎంతో దోహదపడుతుంది. ఈ పాలసీ కొనుగోలు తప్పనిసరి. అయితే ఉద్యోగస్తులుగా వారి యాజమాన్యం ‘గ్రూప్ ఇన్సూరెన్స్’ వంటి సౌలభ్యతలను కల్పిస్తుంది. అయితే ఈ మొత్తం బీమా మీ అవసరాలకు భరోసాను ఇస్తుందా? లేదా? అన్న అంచనాలను వేసుకోవాలి. వైద్య ఖర్చులు 15 నుంచి 20 శాతం వరకూ ప్రతి యేడాదీ పెరుగుతున్నాయన్న విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకు అనుగుణంగా నిర్ఱయం తీసుకోవాలి.
 
పదవీ విరమణపై ఆలోచన
ఇలాంటి ఒక ఆలోచన ఆర్థికంగానే కాదు... జీవిత భాగస్వాముల మధ్య మంచి సెంటిమెంట్లను, భావోద్వేగాలను సైతం సానుకూల రీతిలో పటిష్ట పరుస్తుంది. ‘ఇప్పుడేగా వివాహమైంది..? అప్పుడే పదవీ విరమణ వరకూ ఎందుకు?’ వంటి ఆలోచనలను పక్కనపెట్టి... ఆర్థికంగా ఆయా  అంశాలకూ భవిష్యత్తు ప్రణాళికల్లో చోటివ్వడం ముఖ్యం. సంయుక్త ఆర్థిక అవసరాలు, కోరికలు... వంటి అంశాలకు అనుగుణంగా భార్యా భర్తలు ప్రణాళికలు వేసుకోవాలి. ప్రణాళిక ప్రకారం మదుపుచేసుకోవడం ఇప్పటి నుంచే ప్రారంభించాలి. ఇలాంటి విధానం మీ రిటైర్‌మెంట్ అనంతర జీవితానికి ప్రశాంతతను అందిస్తుంది.
 
సలహాలు తీసుకోవాలి...
అన్ని అంశాల్లోనూ అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో నిపుణుల సలహాలూ తీసుకోవాలి. ప్రస్తుత ద్రవ్యోల్బణం, దాని పెరుగుదల తీరు, పొదుపులు, పెట్టుబడులు వంటి అంశాలపై నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. ప్రతి వ్యక్తి జీవితంలో పిల్లల పెంపకం కీలకం. వీరి విద్యాభ్యాసం నుంచి ఉద్యోగ సముపార్జన వరకూ తల్లిదండ్రులుగా నుంచి సలహాలు, సూచనలు, ఆర్థిక భరోసా అన్నీ ముఖ్యమే. ఆయా అంశాలపై ప్రతి సందర్భంలోనూ నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడమూ కీలకమే. తగిన ప్రణాళిక ద్వారా జీవితంలో పటిష్ట ఆర్థిక నిర్వహణ మీ చేతుల్లోనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్!!

మరిన్ని వార్తలు