తగ్గిన మాల్స్‌ సప్లయి!

31 Mar, 2017 22:55 IST|Sakshi
తగ్గిన మాల్స్‌ సప్లయి!

దేశంలో తొలిసారిగా ప్రతికూలంలో మాల్స్‌
2016లో 3 లక్షల చ.అ. తగ్గిన మాల్స్‌ సరఫరా
దేశంలోని 15 మాల్స్‌లో 35 లక్షల చ.అ. స్థలం తగ్గింపు
ఆఫీసులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలుగా మారుతున్న మాల్స్‌


దేశంలో షాపింగ్‌ మాల్స్‌కు గ్రహణం పట్టింది. ఒకప్పుడు షాపింగ్‌ ప్రియులతో కిటకిటలాడిన మాల్స్‌.. ఇప్పుడు ఆఫీసులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, బాంక్విట్‌ హాల్స్‌గా స్వరూపం మార్చేసుకుంటున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 మాల్స్‌ ఈ జాబితాలో చేరిపోయాయని.. ఇందులో 5 మాల్స్‌ బోర్డు తిప్పేస్తే.. 10 మాల్స్‌ మాత్రం ఇతరత్రా వినియోగంలోకి చేరాయని మొత్తంగా 35 లక్షల చ.అ. స్థలం తగ్గిందని జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో 2016లో కొత్తగా 13 మాల్స్‌ నిర్మాణాలు పూర్తయితే, 15 మాల్స్‌ వాటి స్వరూపం మార్చుకున్నాయి. ఆశించిన స్థాయిలో కస్టమర్ల నుంచి స్పందన లేకపోవటం, అందుబాటులో ఉన్న మాల్స్‌లో వేకెన్సీలు పడిపోవటం, కొత్త మాల్స్‌ నిర్మాణంలో జాప్యం వంటివి దేశంలోని మాల్స్‌ పరిశ్రమ ప్రతికూల స్థితిలోకి చేరడానికి ప్రధాన కారణాలని జేఎల్‌ఎల్‌ ఇండియా రిటైల్‌ సర్వీసెస్‌ ఎండీ పంకజ్‌ రెన్‌జెహాన్‌ తెలిపారు.

గతేడాది దేశంలోని మాల్స్‌లో నికరంగా 27 లక్షల చ.అ. రిటైల్‌ స్థలం నమోదుకాగా.. ఈసారికది 3 లక్షల చ.అ. తక్కువే నమోదైంది. రానున్న రోజుల్లో ఈ జాబితాలో మరిన్ని మాల్స్‌లో చేరే అవకాశముంది. ప్రస్తుతం దేశంలో మాల్స్‌లో ఉన్నత గ్రేడ్‌లో 9 శాతం, సాధారణ గ్రేడ్‌లో 15 శాతం, తక్కువ గ్రేడ్‌లో 41 శాతం వేకెన్సీలున్నాయి.
దేశంలో మాల్స్‌ పరిశ్రమకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రధాన పోటీదారుగా మారింది. ఈ–కామర్స్‌ సంస్థలు పోటాపోటీగా ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌లు, బై బ్యాక్‌లని అందిస్తుండటంతో కొనుగోలుదారులు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో మాల్స్‌లో కస్టమర్ల రాక తగ్గుతుంది. దీంతో వేకెన్సీ లెవెల్స్‌ పెరిగి మాల్స్‌ మూతపడుతున్నాయి.
మాల్స్‌ అంటే కేవలం షాపింగ్‌ మాత్రమే ఉంటే సరిపోదు. వీకెండ్‌లో కుటుంబంతో సహా డైనింగ్, గేమింగ్, మూవీ ఇలా అన్ని రకాల వసతులూ ఉండాలి. అంతేకాదు ఆయా మాల్స్‌ కస్టమర్లకు ఎంత దూరంలో ఉన్నాయి? కనెక్టివిటీ ఎలా ఉంది? మాల్స్‌లో పార్కింగ్‌ స్పేస్‌ ఎలా ఉంది? వంటివి కూడా కొనుగోలుదారులను మాల్స్‌ దాకా తీసుకురావటంలో కీలకంగా మారుతున్నాయి.

కారణాలేంటంటే?
మాల్స్‌ సక్సెస్‌లో ప్రధాన అంశం అది ఉన్న ప్రాంతం. కొనుగోలుదారులకు ఎంత చేరువలో ఉంటే అవి అంత విజయవంతమవుతాయి.
మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న చోట లగ్జరీ మాల్స్‌ నిర్మించడం సరైంది కాదు. అలాగే జనాభాకు తగ్గట్టుగా మాల్స్‌ ఉండాలి. తక్కువ జనాభాకు ఎక్కువ మాల్స్‌ ఉన్నా.. ఎక్కువ జనాభాకు తక్కువ మాల్స్‌ ఉన్నా ఇబ్బందే.
నిర్మాణం తీరు, డిజైన్, లే–అవుట్‌ కూడా మాల్స్‌ విజయంలో భాగస్వామే. మాల్స్‌ డిజైన్‌ సరిగా లేకపోతే అందులోని స్థలం విశాలంగా ఉండదు. ఇరుకిరుగ్గా అనిపిస్తుంటుంది.
నిర్వహణ చార్జీలు కూడా మాల్స్‌ సక్సెస్‌లో తోడుంటాయి. కామన్‌ ఏరియా మెయింటెనెన్స్‌ (సీఏఎం) చార్జీలు ఎక్కువగా ఉంటే మాల్స్‌లోని భరించలేరు. దీంతో మాల్స్‌ నిర్వహణ సక్రమంగా ఉండదు. ఫలితంగా మాల్స్‌ అపరిశుభ్రంగా మారి కొనుగోలుదారులు రారు.

>
మరిన్ని వార్తలు