పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ

22 Feb, 2019 03:46 IST|Sakshi

0.1 శాతం పెంపు

2018–19 ఆర్ధిక సంవత్సరంపై ఈపీఎఫ్‌ఓ నిర్ణయం

న్యూఢిల్లీ: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. పీఎఫ్‌ రేటును పెంచడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. 2015–16లో 8.8 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2016–17లో 8.65 శాతానికి, అటుపై 2017–18లో అయిదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలియజేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతామన్నారు.

‘ఈ ఆర్థిక సంవత్సరానికి అధిక వడ్డీ రేటు ఇవ్వాలని ట్రస్టీలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపుతాం. వారినీ ఒప్పిస్తాం‘ అని గంగ్వార్‌ చెప్పారు. 8.65 శాతం వడ్డీ రేటునిస్తే.. ఈపీఎఫ్‌ వద్ద రూ.151.67 కోట్ల మిగులు ఉంటుందని అందుకే ఈ రేటును నిర్ణయించామని ఆయన చెప్పారు. అదే 8.7 శాతం ఇస్తే రూ.158 కోట్ల లోటు ఉంటుందని తెలియజేశారు. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించవచ్చంటూ ముందుగా వార్తలు వెలువడ్డాయి. అయితే, త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీని పెంచవచ్చంటూ అధికార వర్గాల నుంచి సంకేతాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌వో నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈపీఎఫ్‌వోలో ప్రస్తుతం 6 కోట్ల పైచిలుకు చందాదారులున్నారు. 

పింఛను పెంపుపై నిర్ణయం వాయిదా... 
కనీస నెలవారీ పింఛనును రూ.2,000కు పెంచాలన్న ప్రతిపాదనపై నిర్ణయాన్ని మార్చిలో జరిగే తదుపరి సమావేశం దాకా వాయిదా వేసినట్లు ఈపీఎఫ్‌వో ట్రస్టీ పీజే బానాసురే తెలిపారు. కనీస నెలవారీ పింఛనును రెట్టింపు చేయాలంటే అదనంగా రూ.3,000 కోట్లు అవసరమవుతాయి. అందుకని ఆర్థిక శాఖ అనుమతిస్తే తప్ప దీనిపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్‌ పింఛను పథకం (పీఎంఎస్‌వైఎం) కింద అసంఘటిత రంగ ఉద్యోగులకు కనీసం రూ.3,000 నెలవారీ పింఛను ఇస్తామంటూ ఇటీవల మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పీఎఫ్‌ చందాదారుల పింఛనును కూడా రెట్టింపు చేయాల్సి రానుంది. ప్రభుత్వం నిర్వహించే అన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఒకే మొత్తం పింఛను ఉండాలని, అందుకే ఈపీఎఫ్‌వో చందాదారులకు కూడా పింఛనును రూ. 3,000 చేయాలని తాము కోరుతున్నట్లు భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) జనరల్‌ సెక్రటరీ వీర్జేష్‌ ఉపాధ్యాయ్‌ చెప్పారు.   

మరిన్ని వార్తలు