కార్పొరేట్ పన్ను కోతకు సిద్ధం!

5 Nov, 2015 00:39 IST|Sakshi
కార్పొరేట్ పన్ను కోతకు సిద్ధం!

న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రక్రియ వచ్చే బడ్జెట్ నుంచీ ప్రారంభమవుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ రంగానికి ప్రస్తుతం ఇస్తున్న పన్ను మినహాయింపులను దశలవారీగా ఉపసంహరణ జాబితా కూడా కొద్ది రోజుల్లో విడుదల చేస్తామంటూ బుధవారం ఆయన సూచనప్రాయంగా చెప్పారు.  ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ బేసిక్ పన్ను రేటును నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గిస్తామని  ఆర్థికమంత్రి గత బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ పన్నును తగ్గించినప్పుడు కార్పొరేట్ పన్ను మినహాయింపుల అవసరమూ తగ్గుతుందన్న అభిప్రాయాన్ని అత్యున్నత స్థాయి అధికారులు ఇప్పటికే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 30 శాతం పన్ను రేటు ఇతర దిగ్గజ ఆసియా దేశాల్లో కార్పొరేట్ పన్ను రేటు కన్నా అధికంగా ఉంది. దీనితో భారత్ పరిశ్రమల అంతర్జాతీయ మార్కెట్‌లో ‘ధరల పరంగా’ పోటీని ఎదుర్కొనలేకపోతోంది. ‘నేషనల్ స్ట్రేటజీ డే ఇన్ ఇండియా’ పేరుతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, భారత పరిశ్రమల సమాఖ్య ఇక్కడ భారత్ వృద్ధిపై ఒక సదస్సును నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి...
     
* క్లిష్టమైన పన్ను సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. త్వరలో వస్తు, సేవల పన్ను అమలు అవుతుందని విశ్వాసం కూడా ఉంది. దీనిపై కాంగ్రెస్‌తో మరోసారి ప్రభుత్వం చర్చిస్తుంది.  కార్పొరేట్ పన్ను మినహాయింపుల తొలగింపులపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం.

* దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రికవరీ వేగంగా ఉంది. దేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.5 శాతం నుంచి 8 శాతం శ్రేణిలో వృద్ధి సాధించే సత్తా ఉంది. పరోక్ష పన్ను వసూళ్లలో గణనీయ వృద్ధి రికవరీ వేగాన్ని సూచిస్తోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) పరోక్ష పన్ను వసూళ్లలో 36 శాతం వృద్ధి నమోదయ్యింది.

* అమెరికాలో ఫెడ్ రేటు పెంపు అవకాశాలు, చైనా మందగమనం నేపథ్యంలో పరిణామాలు వంటివి భారత్‌పై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు చూపిస్తాయనడంలో సందేహం లేదు. అయితే మన ఆర్థిక వ్యవస్థ ప్రాతిపదికన ప్రతికూల ప్రభావాలను సాధ్యమైనంత తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది.
     
* విద్యుత్ రంగం సంస్కరణల విషయంలో రానున్న కొద్ది రోజుల్లో ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ రంగంలో సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం.
     
* భూ సేకరణ చట్టం విషయంలో రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకునే దిశలో కేంద్రం ప్రోత్సహించాలన్న ధ్యేయంతోనే ఈ విధానంలో మార్పు జరిగింది.
 
దివాలా వ్యవహారాన్ని 180 రోజుల్లో తేల్చాలి..!
* ప్రభుత్వానికి కమిటీ సిఫారసులు
న్యూఢిల్లీ: దివాలా వ్యవహారానికి సంబంధించి ప్రక్రియ అంతా 180 రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం నియమించిన కమిటీ బుధవారం సిఫారసు చేసింది. ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార వైఫల్యం వంటి కారణాల వల్ల తలెత్తే దివాలా  ప్రక్రియ సత్వర పరిష్కారం లక్ష్యంగా కమిటీ సిఫారసులను రూపొందించింది.  

ఈ నివేదికను కమిటీ చైర్మన్, మాజీ లా సెక్రటరీ టీకే విశ్వనాథన్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి న్యూఢిల్లీలో అందజేశారు. రుణదాతలు, గ్రహీతల మధ్య ఘర్షణలను పరిష్కరించడానికి సంబంధించిన వ్యవస్థను మెరుగుపరచాలని నివేదిక కోరింది. దివాలా అంశాలపై ప్రత్యేక దృష్టికి ఇన్సాల్వెన్సీ రెగ్యులేటర్ ఏర్పాటును కూడా నివేదిక పేర్కొం ది. కంపెనీల విషయంలో న్యాయ అంశాల పరిశీలన అధికారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు ఉండాలని సూచించింది.

వివిధ కంపెనీలకు పలు విధాలుగా కాకుండా అన్నింటికీ వర్తించేలా ఏకైక సమగ్ర దివాలా చట్టం  అవసరమని తెలిపింది. కాగా ఆయా అంశాలన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు