ఫస్ట్ క్రై చేతికి ‘బేబీఓయే’

18 Oct, 2016 01:10 IST|Sakshi
ఫస్ట్ క్రై చేతికి ‘బేబీఓయే’

డీల్ విలువ రూ.361 కోట్లు
న్యూఢిల్లీ: చిన్నారుల ఉత్పత్తుల విభాగంలో ప్రముఖ ఆన్‌లైన్ విక్రయ సంస్థ ఫస్ట్‌క్రై, ఇదే రంగంలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపునకు చెందిన ‘బేబీఓయే’ను సొంతం చేసుకోనుంది. చిన్నారుల ఉత్పత్తుల విభాగంలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న ఫస్ట్‌క్రై ఈ డీల్‌తో మరింత బలమైన సంస్థగా అవతరించనుంది. బేబీఓయేను నగదు, స్టాక్స్ రూపంలో కొనుగోలు చేసేందుకు ఫస్ట్‌క్రై అంగీకరించిందని, ఈ డీల్ విలువ సుమారు రూ.361 కోట్లు అని ఎంఅండ్‌ఎం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు తెలియజేసిన సమాచారంలో పేర్కొంది.

డీల్ రూపం ఇలా...
ఈ డీల్‌లో భాగంగా ఫస్ట్‌క్రై... మహీంద్రా రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.354.6 కోట్ల విలువైన వాటాలను జారీ చేయనుంది. అలాగే రూ.7.5 కోట్ల నగదు చెల్లించనుంది. దీనికి అదనంగా ఫస్ట్‌క్రైకి చెందిన బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.226 కోట్ల మేర నిధులను మహీంద్రా గ్రూపుతోపాటు, స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రైవేటు ఈక్విటీ ఫండ్ అడ్వెక్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, కంపెనీలో ప్రస్తుత ఇన్వెస్టర్లు అయిన ఐడీజీ వెంచర్స్ తదితరుల నుంచి సమీకరిస్తుంది.

బేబీఓయేకు ప్రస్తుతం 120 దుకాణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఫ్రాంచైజీ రూపంలో ఉన్నవి. ఇక ఫస్ట్‌క్రైకు దేశవ్యాప్తంగా 180 స్టోర్స్ ఉన్నాయి. ఈ రెండూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ విక్రయాలు నిర్వహిస్తున్నాయి. ఇక తాజా డీల్ అనంతరం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఆధ్వర్యంలోని దుకాణాలన్నింటినీ ఫస్ట్‌క్రై కింద ఫ్రాంచైజీ రూపంలో నిర్వహిస్తుంది. గతేడాది ఫిబ్రవరిలో బేబేఓయేను మహీంద్రా గ్రూపు కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు