రుణ వృద్ధిలేదు... వ్యాపారాలూ బాగోలేదు!

21 Dec, 2019 06:25 IST|Sakshi

భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ఫిచ్‌ తాజా నివేదిక

వృద్ధి రేటు అంచనా 5.6 శాతం నుంచి 4.6 శాతానికి కోత

వినియోగ విశ్వాసం సన్నగిల్లినట్లు విశ్లేషణ

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– ఫిచ్‌ కుదించింది. 2019 (ఏప్రిల్‌)–2020 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో కేవలం 4.6 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదవుతుందని తాజాగా అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 5.6 %. బ్యాంకింగ్‌ రుణ వృద్ధి మందగమనం, పుంజుకోని పారిశ్రామిక, వ్యాపార రంగాలు, వినియోగ విశ్వాసం దెబ్బతినడం వంటి కారణాలను ఫిచ్‌ తన నివేదికలో ఉటంకించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► భారత్‌ రేటింగ్‌ను స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’గానే కొనసాగిస్తున్నాం. మధ్యకాలికంగా చూస్తే, వృద్ధి అవుట్‌లుక్‌ పటిష్టంగా ఉండడమే దీనికి కారణం. విదేశీ మారకపు నిల్వల స్థాయి పటిష్టంగా ఉండడం సానుకూల అంశం.  
► ఆర్‌బీఐ (5 శాతం), మూడీస్‌ (4.9 శాతం), ఏడీబీ (5.1శాతం) కన్నా తాజాగా ఫిచ్‌ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం.  
► 2020–21లో జీడీపీ క్రమంగా పుంజుకునే అవకాశం ఉంది. ఈ రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. 2021–22లో వృద్ధి రేటు మరింత పెరిగి 6.5 శాతానికి చేరే వీలుంది. ఆర్‌బీఐ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన చర్యలు (వరుసగా ఐదు ద్వైమాసిక సమావేశంలో 135 శాతం రెపో కోత. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 5.15 శాతం), పన్నురేటు తగ్గించడంసహా కేంద్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వృద్ధిరేటు పురోగతికి దోహదపడే వీలుంది.  
► 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ఉండాలన్నది లక్ష్యమయినా, ఇది కొంత అదుపు తప్పే అవకాశం ఉంది.  2019– 20లో మొత్తంలో ద్రవ్యలోటు పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్‌ లక్ష్యం. కానీ అక్టోబర్‌ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్‌ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట.    
► 2020లో ఆర్‌బీఐ మరో 65 బేసిస్‌ పాయింట్ల రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే రెపో రేటు 4.5 శాతానికి వస్తుంది.  
►  నవంబర్‌లో ధరల పెరుగుదల రేటు 5.5 శాతంగా ఉంది.
 

>
మరిన్ని వార్తలు