జీడీపీ వృద్ధి మరింత పైకి

22 Sep, 2018 00:39 IST|Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.8%

గత అంచనాలను పెంచిన ఫిచ్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌’ పెంచింది. గతంలో 7.4 శాతంగా అంచనా వేయగా, తాజాగా దాన్ని 7.8 శాతం చేసింది. జూన్‌ త్రైమాసికంలో జీడీపీ రేటు మెరుగ్గా నమోదవడమే తమ అంచనాల సవరణకు కారణమని తెలిపింది. నిజానికి జూన్‌ త్రైమాసికానికి జీడీపీ 7.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చని ఫిచ్‌ అంచనా వేయగా, వాస్తవ వృద్ధి 8.2 శాతంగా నమోదైంది.

అయితే, పెరుగుతున్న ముడిచమురు దిగుమతుల బిల్లు, అధిక వడ్డీ రేట్లు ఆందోళనకర అంశాలుగా పేర్కొంది. ఇక 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.2 శాతం తగ్గించి 7.3 శాతానికి ఫిచ్‌ సవరించింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తన వైఖరిని వెల్లడించింది.

ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యంలో (4 శాతానికి అటూ, ఇటూ 2 శాతం అదనం) గరిష్టానికి చేరుకోవచ్చని, అధిక డిమాండ్‌ రూపాయిపై ఒత్తిళ్లకు దారితీస్తుందని అంచనా వేసింది. బ్యాంకుల బలహీన బ్యాలన్స్‌ షీట్లు, ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడం, చమురు దిగుమతుల బిల్లు పెరగడం వంటివి ఆర్థిక రంగ భవిష్యత్‌ వృద్ధికి సవాళ్లుగా ఫిచ్‌ పేర్కొంది. రూపాయి ఈ ఏడాది ఇంత వరకు దారుణ పనితీరు చూపించిన ఆసియా కరెన్సీగా అభివర్ణించింది.

మరిన్ని వార్తలు