ఇచ్చిన నిధులన్నీ నష్టాలతో సరి!

2 Jun, 2018 01:08 IST|Sakshi

కేంద్రమిచ్చిన రూ.85 వేల కోట్లు ఆవిరైపోయాయి

ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఫిచ్‌ నివేదిక

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) ప్రకటించిన భారీ నష్టాల కారణంగా... కేంద్రం సమకూర్చిన రూ.85 వేల కోట్ల అదనపు మూలధనం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని రేటింగ్స్‌ ఏజెన్సీ ఫిచ్‌ పేర్కొంది. బలహీనంగా ఉన్న పీఎస్‌బీల పరిస్థితి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడే అవకాశాలు కనిపించటం లేదని కూడా స్పష్టంచేసింది. భారీ నష్టాల కారణంగా వాటి లాభదాయకతపై, రేటింగ్స్‌పై కూడా ఒత్తిడి తప్పదని హెచ్చరించింది.

‘‘మొండిబాకీలను సత్వరం గుర్తించేలా... నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) వర్గీకరణలో చేసిన మార్పుల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యంత పేలవమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి వచ్చింది. అయితే, దీర్ఘకాలంలో బ్యాంకింగ్‌ రంగ పరిస్థితి మెరుగుపడేందుకు ఈ ప్రక్షాళన తోడ్పడుతుంది. ఎన్‌పీఏల వర్గీకరణ వల్ల మొత్తం బ్యాంకింగ్‌ రంగంలో మొండిబాకీలు ఊహించిన దానికన్నా మరింత అధికంగా పెరిగి 9.3% నుంచి 12.1%నికి చేరాయి. పీఎస్‌బీల సగటు ఎన్‌పీఏలు 14.5 శాతానికి ఎగిశాయి.’’అని పేర్కొంది.

ప్రభుత్వం మరిన్ని నిధులిస్తే తప్ప...: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగంలోని మొత్తం 21 బ్యాంకుల్లో... దిగ్గజం ఎస్‌బీఐసహా 19 బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటించాయి. పీఎన్‌బీసహా ఆరు పీఎస్‌బీల మూలధనం... కనిష్ట స్థాయికన్నా దిగువకి పడిపోయింది.

ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకు ఇవి నిర్దేశిత 8 శాతం స్థాయిని చేరుకోవాల్సి ఉంటుందని ఫిచ్‌ పేర్కొంది. 2018–19లో ప్రభుత్వం ఇస్తామన్న రూ.72 వేల కోట్ల అదనపు మూలధనం సాయంతో నియంత్రణ సంస్థల చర్యల నుంచి బ్యాంకులు తప్పించుకున్నా... అవి స్థిరపడటానికి,  వృద్ధి సాధించడానికి, నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు సాగించడానికి కేంద్రం మరిన్ని నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఫిచ్‌ వివరించింది.

మరిన్ని వార్తలు