ఆధార్‌ వివరాలతో అక్రమంగా మనీ విత్‌డ్రా

5 Jan, 2018 14:26 IST|Sakshi

ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానమైన బ్యాంకు అకౌంట్లు చోరి మరింత పెరిగింది. కస్టమర్ల ఆధార్‌ డేటా వాడుతూ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా చేసినట్టు వెల్లడైంది.  ఇలా మొత్తం ఐదు కేసుల వరకు నమోదయ్యాయి. కస్టమర్లకు కనీసం సమాచారం లేకుండా ఆధార్‌ వివరాలు వాడుతూ.. రూ.4,20,098 విత్‌డ్రా అయినట్టు ఆంధ్రాబ్యాంకులో నాలుగు కేసులు నమోదుకాగ, సిండికేట్‌ బ్యాంకు నుంచి రూ.1,21,500 విత్‌డ్రా అయినట్టు మరో కేసు నమోదైంది.

ఈ కేసులు మాత్రమే కాక, 2015 నుంచి ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.7.65 లక్షలు మోసపూరితంగా విత్‌డ్రా అయినట్టు మొత్తం 20 ఫిర్యాదులు బ్యాంకింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు వెల్లువెత్తాయి. ఈ 20 కేసులు కూడా ఐదు బ్యాంకులకు చెందినవి మాత్రమే.ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకులో గరిష్టంగా 15 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో రెండు కేసులు, యూసీఓ బ్యాంకులో ఒక కేసు నమోదైనట్టు కేంద్రప్రభుత్వం లోక్‌సభకు చెప్పింది. ఆర్థికమంత్రిత్వ శాఖ డేటా ప్రకారం మొత్తంగా రికార్డైన 25 కేసుల్లో ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ల నుంచి అక్రమంగా రూ.13.06 లక్షలు విత్‌డ్రా అయినట్టు తెలిసింది. అయితే ఇలా పోయిన నగదును బ్యాంకు తన కస్టమర్లకు 10 రోజుల్లో క్రెడిట్‌  చేయనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. 

ప్రస్తుతం ఆధార్‌ను అన్నింటికీ ఆధారం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకు అకౌంట్లకు, ఇన్సూరెన్స్‌ పాలసీలకు, పాన్‌ వంటి వాటికి కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. 2017 డిసెంబర్‌ 15 నాటికి 106.41 కోట్ల కరెంట్‌ అకౌంట్‌, సేవింగ్స్‌ అకౌంట్‌, 82.47 కోట్ల అకౌంట్లు ఆధార్‌తో లింక్‌ అయ్యి ఉన్నాయి.  అయితే ఆధార్‌ డేటా లీకైందని వస్తున్న వార్తలపై యూఐడీఏఐ గట్టిగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆధార్‌డేటా చోరి చేయడానికి వీలులేదని, ఈ దొంగతనం జరుగలేదంటూ కొట్టిపారేసింది. 
 

మరిన్ని వార్తలు