ముడి చమురు సెగ 

18 May, 2018 01:32 IST|Sakshi

80 డాలర్లకు బ్రెంట్‌ చమురు 

బీజేపీ బలనిరూపణపై అనిశ్చితి 

ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ 

10,700 దిగువకు నిఫ్టీ  

58 పాయింట్ల నష్టంతో 10,683 వద్ద ముగింపు  

239 పాయింట్ల పతనంతో 35,149కు సెన్సెక్స్‌

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతుండటం,  ముడి చమురు ధరలు భగ్గుమంటుండటంతో వరుసగా మూడో రోజూ స్టాక్‌ సూచీలు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు కూడా ప్రతికూలంగా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, అంతంత మాత్రంగానే ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు... ఈ కారణాల వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌239 పాయింట్ల నష్టంతో 35,149 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 58 పాయింట్లు పతనమై 10,683 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడంతో నష్టాలు ఒకింత తగ్గాయి. ఫార్మా, రియల్టీ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల పాలయ్యాయి.  

80 డాలర్లకు బ్యారెల్‌ ముడి చమురు 
అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌ చమురు దిగుమతులు తగ్గుతాయనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌  చమురు ధర 80 డాలర్లపైకి చేరింది. 2014, నవంబర్‌ తర్వాత ముడి చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం.  దీంతో చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న మన దేశం దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుందని, ద్రవ్యలోటు పరిస్థితి మరింత అధ్వానమవుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. మెజారిటీకి 8 మంది ఎంఎల్‌ఏలు తక్కువగా ఉండటంతో బీజీపీ ప్రభుత్వం బల నిరూపణలో ఎలా గట్టెక్కుతారోనన్న అనిశ్చితి ప్రతికూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ 35,484 పాయింట్ల వద్ద లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో 122 పాయింట్ల లాభంతో 35,510  పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది.  ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారిపోయింది. 300 పాయింట్ల నష్టంతో 35,088 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ట స్థాయిని  తాకింది. రోజంతా 422 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 36 పాయింట్లు లాభపడగా, మరో దశలో 77 పాయింట్లు నష్టపోయింది.  

ఆర్‌కామ్‌ 57 % అప్‌...
బుధవారం నష్టపోయిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్‌ గురువారం భారీగా లాభపడింది. బకాయిల రికవరీ కోసం ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఎరిక్సన్‌ సంస్థ దివాళా పిటిషన్‌ దాఖలు చేసింది. ఎరిక్సన్‌ కంపెనీతో సెటిల్మెంట్‌కు ఆర్‌కామ్‌ ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో ఈ షేర్‌ 57 శాతం లాభంతో రూ.16.55  వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 76 శాతం లాభంతో రూ.17.70ను తాకింది. ఇతర అనిల్‌ అంబానీ షేర్లు కూడా మంచి లాభాలు సాధించాయి. రిలయన్స్‌ నేవల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 33 శాతం పెరిగింది.  

మరిన్ని వార్తలు