ఫెస్టివల్‌ గిఫ్ట్‌ : ఫ్లిప్‌కార్ట్‌లో 30వేల ఉద్యోగాలు

8 Oct, 2018 16:59 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్‌లో సీజనల్‌ ఉద్యోగాలు (ఫైల్‌ ఫోటో)

బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్‌ ఆఫర్స్‌తో పాటు, భారీగా ఉద్యోగాల జాతరకు తెరలేపింది. రాబోతున్న ఫెస్టివల్‌ సేల్‌ కోసం 30వేల సీజనల్‌ ఉద్యోగాలను అందించింది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా సప్లయి చైన్‌, లాజిస్టిక్స్‌ ఆపరేషన్లలో కల్పించింది. ఈ పండుగ సేల్‌లో అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు, ఫ్లిప్‌కార్ట్‌ ఈ మేరకు సన్నద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌ తన నాలుగో ఎడిషన్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను అక్టోబర్‌ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతుంది. ఈ సేల్‌ జరిగే సమయంలో, ఫ్లిప్‌కార్ట్‌ విక్రయ భాగస్వాములు కూడా తమ ప్రాంతాల్లో పరోక్షంగా ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. తమ వినియోగదారులకు సజావుగా షాపింగ్‌ అనుభవాన్ని అందిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి చెప్పారు. సప్లయి చైన్‌ వ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్‌ ఈ సీజనల్‌ ఉద్యోగాలను కల్పించింది. వీటిలో వేర్‌హౌజ్‌లు, మదర్‌ హబ్స్‌, డెలివరీ హబ్స్‌ ఉన్నాయి. ప్యాకేజింగ్‌, వేర్‌హౌజ్‌ మేనేజ్‌మెంట్‌లలో అదనంగా పరోక్ష ఉద్యోగాలను కూడా సృష్టించింది ఫ్లిప్‌కార్ట్‌. 

ఫెస్టివల్‌ సేల్‌లో ఎక్కువ మొత్తంలో వచ్చే ఆర్డర్లను సజావుగా చేపట్టేందుకు ఈ-కామర్స్‌ కంపెనీలు ప్రతి సీజన్‌లోనూ వేలమంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటాయి. అమెజాన్‌ ఇండియా కూడా దేశవ్యాప్తంగా 50వేల సీజనల్‌ ఉద్యోగాలను సృష్టించింది. రాబోతున్న ఫెస్టివల్‌ సేల్‌లో 20 మిలియన్‌కు పైగా వినియోగదారలు పలు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై షాపింగ్‌ చేసే అవకాశముందని తెలుస్తోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి వాటికి 3 బిలియన్‌ డాలర్ల విక్రయాలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని రీసెర్చ్‌ సంస్థ రెడ్‌షీర్‌ రిపోర్టు పేర్కొంది. ఆఫ్‌లైన్‌ రిటైలర్లకు కూడా ఈ దసరా, దివాళి ఫెస్టివల్‌ సీజన్‌లో విక్రయాలు భారీగానే నమోదవుతాయి. వార్షిక విక్రయాలను పెంచుకోవడానికి ఈ కంపెనీలకు సెప్టెంబర్‌-నవంబర్‌ కాలమే అత్యంత కీలకం. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు స్నాప్‌డీల్‌ కూడా ‘మెగా దివాళి సేల్‌’ను అక్టోబర్‌ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతుంది. ప్రస్తుతం నియమించుకున్న ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ ఉద్యోగులు టెక్‌తో నడిచే సప్లయి చైన్‌, ఫుడ్‌ టెక్‌, ఇతర సంబంధిత పరిశ్రమల్లో పనిచేసేందుకు ఈ అనుభవం ఉపయోగపడనుంది. 
  

మరిన్ని వార్తలు