‘ఈ–కామర్స్‌’కు కళ్లెం..!

27 Dec, 2018 00:18 IST|Sakshi

నిబంధనలు కఠినతరం

ఎక్స్‌క్లూజివ్‌ ఒప్పందాలపై ఆంక్షలు

వాటాలున్న సంస్థల ఉత్పత్తులు అమ్మకూడదు

 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి... 

న్యూఢిల్లీ: చిన్న వ్యాపారస్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడులున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ తదితర ఈ–కామర్స్‌ కంపెనీల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం...  తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను ఈ–కామర్స్‌ సంస్థలు తమ సొంత పోర్టల్స్‌లో విక్రయించడం కుదరదు.  ధరను ప్రభావితం చేసేలా ఏ ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా తమ పోర్టల్స్‌లోనే విక్రయించేలా ఈ–కామర్స్‌ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోకూడదు.  తమ షాపింగ్‌ పోర్టల్స్‌లో విక్రయించే విక్రేతలకు సర్వీసులు అందించడంలో ఈ–కామర్స్‌ సంస్థలు పక్షపాతం, వివక్ష చూపించకూడదు. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, అడ్వర్టైజ్‌మెంట్, మార్కెటింగ్, పేమెంట్స్, ఫైనాన్సింగ్‌ మొదలైన సర్వీసులు ఇందులో ఉంటాయి.  ఈ–కామర్స్‌ సంస్థకు చెందిన గ్రూప్‌ కంపెనీలు.. కొనుగోలుదారులకు అందించే క్యాష్‌ బ్యాక్‌ వంటి ఆఫర్ల విషయంలో న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. 

ఏదైనా ఒక ఈ–కామర్స్‌ సైట్‌లో విక్రేతలు తమ దగ్గరున్న నిల్వల్లో 25 శాతం ఉత్పత్తులకు మించి విక్రయించరాదు. ఉదాహరణకు, 4,000 యూనిట్ల ఉత్పత్తులు ఉంటే.. ఒక ఈ–కామర్స్‌ పోర్టల్‌లో 1,000 మాత్రమే విక్రయించవచ్చు.  నిబంధనలన్నింటినీ పాటిస్తున్నట్లుగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఆడిట్‌ సర్టిఫికెట్‌ను ఈ– కామర్స్‌ కంపెనీలు ఆ పై ఏడాది సెప్టెంబర్‌ 30 లోగా రిజర్వ్‌ బ్యాంక్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి సవరించిన కొత్త విధానంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పుష్కలంగా నిధులున్న ఈ–కామర్స్‌ సంస్థల తీవ్ర పోటీ నుంచి దేశీ వ్యాపార సంస్థల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఈ నిబంధనలు రూపొందించినట్లు వివరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.  ప్రస్తుత విధానం ప్రకారం విక్రేత, కొనుగోలుదారుకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే మార్కెట్‌ప్లేస్‌ తరహా ఈ–కామర్స్‌ సంస్థల్లో మాత్రమే ప్రస్తుతం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఉన్నాయి.

ఇలాంటి సంస్థలు తాము స్వయంగా కొనుగోళ్లు జరిపి, ఉత్పత్తులను నిల్వ చేసుకుని, విక్రయించడానికి లేదు. కొనుగోలుదారులకు ఈ–కామర్స్‌ కంపెనీలు భారీ డిస్కౌంట్లిస్తూ తమ వ్యాపారాలను దెబ్బ తీస్తున్నాయంటూ దేశీ వ్యాపార సంస్థల నుంచి పెద్ద యెత్తున ఫిర్యాదులు రావడంతో ఈ–కామర్స్‌ సంస్థలను నియంత్రించే క్రమంలో కేంద్రం తాజా చర్యలు ప్రకటించింది.  పెట్టుబడులకు ప్రతికూలం.. కొత్త నిబంధనలపై పరిశ్రమవర్గాలు మిశ్రమంగా స్పందించాయి. కొత్తగా మరింత మంది విక్రేతలను ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం వైపు ఆకర్షించే దిశగా పెడుతున్న పెట్టుబడులపై ఇవి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ–కామర్స్‌ రంగంలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు వ్యాఖ్యానించారు. సర్క్యులర్‌ ను పరిశీలిస్తున్నామని అమెజాన్‌ ఇండియా ప్రతి నిధి వెల్లడించారు. అయితే, తాజా నిబంధనలను ఈ–కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ స్వాగతించింది. ‘మార్కెట్‌ప్లేస్‌లనేవి నికార్సయిన, స్వతంత్ర వెం డార్ల కోసం ఉద్దేశించినవి. వీటిలో చాలా సంస్థలు చిన్న, మధ్యస్థాయివే. కొత్త మార్పులతో.. అందరికీ సమాన అవకాశాలు లభించగలవు‘ అని స్నాప్‌డీల్‌ సీఈవో కునాల్‌ బెహల్‌ వ్యాఖ్యానించారు.    

స్వాగతించిన సీఏఐటీ..  
తాజా నిబంధనలను ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ స్వాగతించింది. ఈ–కామర్స్‌ రంగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని, ఈ–కామర్స్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని కోరింది. ‘సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న విజయం ఇది. దీన్ని సక్రమంగా అమలు చేస్తే.. ఈ–కామర్స్‌ కంపెనీలు పాటించే అనుచిత వ్యాపార విధానాలు, పోటీ లేకుండా చేసే ధరల విధానాలు, భారీ డిస్కౌంట్లు మొదలైనవి ఇకపై ఉండబోవు‘ అని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ వ్యాఖ్యానించారు. ఈ నిబంధనలను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కాకుండా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే వర్తింపచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలన్నారు. 

మరిన్ని వార్తలు