భారీ సబ్సిడీతో ఏథర్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు

5 Jun, 2018 21:22 IST|Sakshi

సాక్షి, బెంగళూరు:  బెంగళూరు ఆధారిత స్టార్టఅప్‌ కంపెనీ ఏథర్ ఎనర్జీ  ఫ్లాగ్‌షిప్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లను మంగళవారం లాంచ్‌ చేసింది.  మేడిన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశంలో తయారైన స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను  రెండు వేరియంట్‌లలో  విడుదల  చేసింది. ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్‌ మద్దతుతో ఎథర్  కంపెనీ ఏథర్‌ 340, ఎథర్ 450 పేరిట ఈ రెండు స్కూటర్లు మార్కెట్‌లో  ఆవిష్కరించింది.  ఎథర్ వెబ్‌సైట్‌తోపాటు బెంగుళూరులోని ఎథర్ స్టోర్‌లో ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించారు.  అమెరికాలోని  తెస్లా తరువాత ఈ తరహాలో ఎలక్ట్రిక్‌ బైక్స్‌లను తయారుచేస్తున్న తొలి సంస్థగా ఏథర్‌ నిలవనుంది. ప్రభుత్వం నుంచి దాదాపు 20 శాతం సబ్సిడీతో కలిపి ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాహనాలతో పోలిస్తే సగం ధరలకే ప్రారంభించింది. అయితే ఈ వాహనాలు తొలుత బెంగళూరులో మాత్రమే లభ్యమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇతర నగరాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

రెండు మోడల్స్‌లోను  సిమ్‌కార్డుల ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి.  రెండు స్కూటర్లు పూర్తిగా విద్యుత్‌పై ఆధారపడి పనిచేస్తాయి. దీనికోసం ప్రత్యేకమైన బ్యాటరీలను ఏర్పాటు చేశారు. కేవలం 1 నిమిషం పాటు చార్జింగ్ పెడితే చాలు, 1 కిలోమీటర్ దూరం వెళ్లగలిగేంత వేగంగా చార్జింగ్ అవుతాయి.  సిటీ రైడింగ్ కండిషన్స్‌కు అనుకూలంగా తయారు చేసిన ఎథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌  గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.  కేవలం 3.9 సెకండ్లలోనే గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌ను ఈ స్కూటర్  సొంతం. అలాగే ఎథర్ 340 స్కూటర్ గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ స్కూటర్ 5.1 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందుకోగలదు.  దీనితోపాటు ఏథర్ ఎనర్జీ బెంగళూరు నగర వ్యాప్తంగా ఇప్పటికే 30 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.  ఏథర్‌గ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్లు ఫాస్ట్-ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా  అందుబాటులో ఉంచింది.

ఫీచర్లు
7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అందులో స్పీడ్, బ్యాటరీ కెపాసిటీ, తిరిగిన కిలోమీటర్లు, నావిగేషన్ వంటి సదుపాయాలు లభిస్తున్నాయి. ఇక ఈ స్కూటర్లలో ఉండే సాఫ్ట్‌వేర్‌కు ఎప్పటికప్పుడు ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) రూపంలో అప్‌డేట్లను అందిస్తారు. ఈ స్కూటర్లను మొబైల్ యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.  తద్వారా  స్కూటర్ ఎక్కడ ఉంది ఫోన్‌లో లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చన్నమాట. ఈ స్కూటర్లలో ఉన్న బ్యాటరీ లైఫ్‌ 5 నుంచి 6 సంవత్సరాలు.  ఐపీ67 రేటింగ్ ఈ బ్యాటరీ  వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను జోడించింది. ఈ బ్యాటరీలు 50వేల కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. ఈ స్కూటర్లలో ఉన్న బ్యాటరీ పూర్తి చార్జింగ్‌కు 4 గంటల 18 నిమిషాల సమయం పడుతుంది. ఈ స్కూటర్లకు 2 ఏళ్ల వారంటీ (30వేల కిలోమీటర్లు)ని అందిస్తున్నారు. అంతేకాదు బ్యాటరీకి 3 ఏళ్ల వారంటీని అందిస్తోంది.

ధర, ఇతర ఆఫర్లు
ఏథర్ 450 ఆన్‌రోడ్ ధర రూ.1,24,750 ఉండగా, ఏథర్ 340 ఆన్‌రోడ్ ధర రూ.1,09,750 గా ఉంది.  ఇందులో ఎలక్ట్రిక్‌వాహనాలకు ప్రోత్సాహమిచ్చే ప్రభుత్వ పథకం "ఫేం" కింద 22 వేల రూపాయల సబ్సిడీ జీఎస్‌టీ, రోడ్‌ట్యాక్స్, స్మార్ట్ కార్డ్ ఫీజు, రిజిస్ట్రేషన్ కార్డు, ఇన్సూరెన్స్ అన్నీరేట్లను కలిపి ఈ ధర అని తెలిపింది.  వీటి కొనుగోలుకు ఈఎంఐ ఆఫర్‌ కూడా లభ్యం.. అలాగే  700రూపాయల నెలవారీప్లాన్‌ను కూడా కంపెనీ లాంచ్‌ చేసింది. ఇందులో  సర్వీసు, డోర్‌స్టెప్‌ పికప్‌, డెలివరీ,  బ్రేడ్‌ డౌన్‌ అసిస్టెన్స్‌, వాహనాలపై డేటా ఛార్జీలు, వినియోగం, ఇంధనం లాంటి ఇతర సేవలను ఆఫర్‌ చేస్తోంది. ఇంటి దగ్గర, ఆఫీసు,  లేదా సాధారణ సాకెట్ నుండి వినియోగదారులు ఈ వాహనాన్ని ఛార్జ్ చేయవచ్చు. మూడు నెలల లోపల  దీన్ని రీఫండ్‌ ఇస్తుంది.

కాగా దేశంలోని నెంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, వాల్మార్ట్ భాగస్వామి ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు, హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌ సహా, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పెట్టుబడిదారుల నుండి ఇప్పటివరకు 43 మిలియన్ డాలర్ల నిధులు సేకరించింది ఏథర్‌ ఎనర్జీ.

మరిన్ని వార్తలు