ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు శుభవార్త, కొత్త ఫీచర్‌

27 Nov, 2019 19:16 IST|Sakshi

సాక్షి, ముంబై: వాల్‌మార్ట్‌ సొంతమైన భారత ఇకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఆన్‌లైన్‌ లావాదేవీల సందర్భంగా కొత్త కస‍్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ‘ఫ్లిప్‌కార్ట్ సాథీ’ అనే ‘స్మార్ట్ అసిస్టివ్‌ ఇంటర్‌ఫేస్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. హిందీ, ఇంగ్లీషు భాషల్లో  టెక్స్ట్, ఆడియో-గైడెడ్ నావిగేషన్ ద్వారా మొదటిసారి ఇకామర్స్ వినియోగదారులే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది. 

గ్రామీణ భారతదేశం, టైర్‌ 2, 3 నగరాల్లో ఆన్‌లైన్ లావాదేవీలను సౌకర్యవంతంగా, సులభంగా చేయడంతో పాటు, మరింత ఎక్కువమంది యూజర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న 200 మిలియన్ల వినియోగదారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి వెల్లడించారు. కొత్త వినియోగదారులు తమ స్వంతంగా బ్రాండ్లు, ఉత్పత్తుల ఎంపిక, ఫిల్టర్ చేయడంలో సహాయం అవసరమని తమ అధ్యయనంలో గ్రహించామనీ,  ఈ నేపథ్యంలోనే ఆడియో పాఠాల(ఆడియో-గైడెడ్ నావిగేషన్)  ఫీచర్‌ను తీసుకొచ్చామని తెలిపారు.

ఈ కొత్త ఫీచర్‌ కొత్తగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు టెక్స్ట్‌ ఆడియో ద్వారా  అవగాహన కల్పిస్తుంది, మార్గ నిర్దేశనం చేస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని, ఆస్వాదించడాన్ని ఈ ఫీచర్‌ మరింత సులభతరం చేస్తుందని ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ జయంద్రన్ వేణుగోపాల్ అన్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సందర్భంగా వినియోగదారులు ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించడం కూడా స్మార్ట్ అసిస్టివ్ ఇంటర్‌ఫేస్ లక్ష్యమని చెప్పారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా