ఫ్లిప్‌కార్ట్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌, భారీగా ఉద్యోగాలు

9 Mar, 2018 09:08 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ (ఫైల్‌ ఫోటో)

బెంగళూరు : లాజిస్టిక్స్‌ సెక్టార్‌... ఏ దేశ అభివృద్ధిలోనైనా దీని పాత్ర అమోఘం. ఇటీవల కాలంలో భారత్‌లో ఈ రంగం విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. 2014 నుంచి వరల్డ్‌ బ్యాంకు లాజిస్టిక్స్‌ ఫర్‌ఫార్మెన్స్‌లో భారత ర్యాంకు 19 స్థానాలు పైకి ఎగిసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 35 మల్టి-లెవల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు  గతేడాదే ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ను కర్నాటకలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 4.5 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నట్టు పేర్కొంది. దీని కోసం బెంగళూరు శివారులో 100 ఎకరాల భూమిని కూడా ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేయబోతున్నట్టు తెలిసింది.   

ఈ ప్రాజెక్టులో తాము వందల మిలియన్లను పెట్టుబడులుగా పెట్టనున్నామని, దీంతో మొత్తంగా వ్యయాలను తగ్గించుకుని, డెలివరీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోనున్నామని ఫ్లిప్‌కార్ట్‌ లాజిస్టిక్‌ ఆర్మ్‌ ఈకార్ట్‌ అధినేత అమితేజ్‌ జా తెలిపారు. ఏ ఈ-కామర్స్‌ వ్యాపారానికైనా లాజిస్టిక్స్‌  అనేవి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ అమల్లోకి వచ్చాక తమ లాజిస్టిక్‌ వ్యయాలు 20 శాతం తగ్గుతాయని, డెలివరీ సమయం కూడా 50 శాతం తగ్గిపోతుందని తెలిపారు.

అంతేకాక ఈ ప్రాజెక్ట్‌ భారీగానే ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించనుందని, ప్రత్యక్షంగా 5వేల ఉద్యోగాలను, పరోక్షంగా 15వేల ఉద్యోగాలను కల్పించనుందని చెప్పారు. కొత్త పెట్టుబడులు ఆకర్షణ మాత్రమే కాక,నిర్మాణం, కనెక్టివిటీ ద్వారా గ్రామీణాభివృద్ధి కూడా చేపట్టవచ్చన్నారు. ఈ ప్రాజెక్ట్‌ తొలి దశను ఫ్లిప్‌కార్ట్‌ 2019 మధ్యలో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగ, త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద రిటైలర్‌ వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది.

మరిన్ని వార్తలు