బీమా రంగంలోకి ఫ్లిప్‌కార్ట్‌

8 Oct, 2018 00:45 IST|Sakshi

బజాజ్‌ అలయంజ్‌తో జట్టు 

మొబైల్‌ ఫోన్లకు బీమా కవరేజీ 

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ ఏజెంట్‌ లైసెన్సు దక్కించుకున్న ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపింది. ఇకపై తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే అన్ని ప్రముఖ మొబైల్‌ బ్రాండ్స్‌ ఫోన్లకు కస్టమైజ్డ్‌ బీమా పాలసీలు అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. నగదు చెల్లింపు లేదా ఉచిత పికప్, సర్వీస్, డ్రాప్‌ వంటి సర్వీసులు ఈ పాలసీల ప్రత్యేకతలని పేర్కొంది. అక్టోబర్‌ 10న ప్రారంభించే ది బిగ్‌ బిలియన్‌ డేస్‌ (టీబీబీడీ) సేల్‌ రోజు నుంచి ఈ ఇన్సూరెన్స్‌ పాలసీల విక్రయం మొదలవుతుందని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవి గరికపాటి తెలిపారు.

కంప్లీట్‌ మొబైల్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ (సీఎంపీ) పేరిట అందించే ఈ పాలసీ ప్రీమియం రూ. 99 నుంచి ఉంటుందని బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ తపన్‌ సింఘెల్‌ తెలిపారు. ఫోన్‌ చోరీకి గురవడం, స్క్రీన్‌ దెబ్బతినడం మొదలైన వాటన్నింటికీ కవరేజీ ఉంటుంది. క్లెయిమ్స్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌కి యాప్‌ ద్వారా లేదా ఈమెయిల్, ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్‌ను సర్వీస్‌ చేయించుకోవడం లేదా పరిహారం తీసుకోవడం అప్షన్స్‌ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ పరిహారం తీసుకోదలిస్తే.. కస్టమర్‌ బ్యాంక్‌ ఖాతాకు బీమా సంస్థ నగదు బదిలీ చేస్తుంది. 

మరిన్ని వార్తలు