లాబీయింగ్ చేస్తున్నఫ్లిప్ కార్ట్ !

30 Jun, 2016 12:06 IST|Sakshi
లాబీయింగ్ చేస్తున్నఫ్లిప్ కార్ట్ !

బెంగళూరు: ఈ-కామర్స్ సంస్థలకు ఇప్పుడిప్పుడే తత్త్వం బోధపడుతోందిట. తమ మధ్య కోల్పోయిన సఖ్యతను మెరుగు పరుచుకునేందుకు దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ చైర్మన్ సచిన్ బన్సాల్ ఓ మెట్టు దిగొచ్చారట. ఈ-కామర్స్  సంస్థల మధ్య కరువైన సఖ్యతను పెంచి, రిటైలర్లకు చెక్ పెట్టాలని ఫ్లిప్ కార్ట్ చైర్మన్ సచిన్ బన్సాల్ ప్రయత్నాలు మొదలు పెట్టారట. రిటైలర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) వంటి ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రభుత్వ పాలసీలను ప్రభావితం చేస్తున్న ఆదిత్య బిర్లా గ్రూప్, ఫ్యూచర్ గ్రూప్ వంటి సంస్థలకు కౌంటర్ గా తాము ఓ లాబీ గ్రూప్ ను ఏర్పాటుచేసుకోవాలని ఈ-కామర్స్ సంస్థలకు సచిన్ బన్సాల్ పిలుపునిస్తున్నారట.

బన్సాల్ తో పాటు ఇతర ఈ-కామర్స్ , ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలు ఇటీవలే ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హాను కలిసి తమ ఆన్ లైన్ రంగ ఆందోళనలను ఆయనతో వెల్లబుచ్చుకున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బాధ్యతగా బన్సాలే నిర్వర్తించారని, అన్ని ఈ-కామర్స్ ప్లాంట్ ఫామ్ లకు తానే స్వయానా ఆహ్వానం పంపి, సిన్హాతో భేటీ అయినట్టు పేర్కొంటున్నాయి. తమ మధ్యనున్న ఈ తేడాను అడ్వన్ టేజ్ గా తీసుకున్న రిటైల్ సంస్థలు వారి లాబీ గ్రూప్ ఆర్ఏఐతో మొత్తం ఎకో సిస్టమ్ పై ప్రభావం చూపుతున్నాయని ఇప్పటికీ ఈ-కామర్స్ సంస్థలకు బోధపడిందని, ఆన్ లైన్ సంస్థలు సఖ్యతకు బన్సాల్ చొరవ తీసుకుంటున్నారని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.


ఈ-కామర్స్ కంపెనీల మధ్య వ్యూహాలు, మార్గాలు వేరువేరుగా ఉంటాయని, కాని కొన్ని సమస్యలను మాత్రం కామన్ గా ఎదుర్కోవల్సి ఉంటుందని ఈ మీటింగ్ లో పాల్గొన్న ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్  చెప్పారు. ఈ కామెంట్లపై స్పందించడానికి ఫ్లిప్ కార్ట్ తిరస్కరించింది. అయితే తమను మాత్రం సిన్హాతో భేటికి ఆహ్వనించలేదని అమెజాన్ కంపెనీ అధికార ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇష్టారీతిలో డిస్కౌంట్ ఆఫర్లు గుప్పిస్తూ భారీగా వ్యాపారాన్ని పెంచుకుంటున్న ఈ-టైలర్స్ కు చెక్  చెప్పేందుకు ప్రభుత్వం ఏప్రిల్ లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ పోర్టల్ లో ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండొద్దని ఆదేశాలు జారీచేసింది. వివిధ రాష్ట్రాల పన్నులనూ ఈ-టైలర్స్ భరించాల్సి ఉంటుందని వెల్లడించింది. విదేశీ ఫండెడ్ వెంచర్లను సైతం మార్కెట్ ప్లేస్ కార్యకలాపాలకే వాడాలని, డిస్క్కౌంట్లు గుప్పించడానికి వాడుకోకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించింది.     
 

మరిన్ని వార్తలు