-

ఇక ఈబే ఇండియా లేదు

14 Aug, 2018 17:45 IST|Sakshi
మూతపడిన ఈబే ఇండియా (ఫైల్‌ ఫోటో)

బెంగళూరు : చాలా సంవత్సరాలుగా భారత్ ఈ-కామర్స్ మార్కెట్లో తన సేవలను అందించిన ఆన్‌లైన్ సంస్థ ఈబే.ఇన్ మూతపడింది. నేటి నుంచి అంటే ఆగష్టు 14 నుంచి తన ఈబే.ఇన్‌ కార్యకలాపాలను దిగ్గజ ఈ-రిటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ మూసివేసింది. అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటా దక్కించుకున్న మూడు నెలల అనంతరం ఫ్లిప్‌కార్ట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ‘క్షమించండి, ఈబే.ఇన్‌లో ఇక ఏ లావాదేవీలు జరుపడానికి వీలుండదు. కానీ ఆందోళన చెందాల్సివసరం లేదు. ఫ్లిప్‌కార్ట్‌ త్వరలో మరో కొత్త బ్రాండ్‌ షాపింగ్‌ అనుభవాన్ని అందించనుంది’ అని ఈబే ఇండియా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

ఏ కొత్త ఆర్డర్లను ఇక ఈబే స్వీకరించదు. కొనుగోలుదారులు తమ క్లయిమ్స్‌ను పొందడానికి చివరి తేదీ ఆగస్టు 30గా కంపెనీ నిర్ణయించింది. జూలై 26 నుంచే 250 రూపాయల కంటే తక్కువ, 8000 రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన ఉత్పత్తులను డీలిస్ట్‌ చేయడం ప్రారంభించింది. కాగా, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంవత్సరం క్రితం 1.4 బిలియన్‌ డాలర్లకు ఈబేను కొనుగోలు చేసింది. 1995లో ఈబేను స్థాపించారు. ఇది కాలిఫోర్నియాకు చెందినది. 2004లో ఈబే భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది.  అయితే ఈబే బ్రాండ్‌ను మూసేసి.. ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్ పైనే కొత్త పేరుతో ఈబే అమ్మకాలను సాగించాలని ఫ్లిప్‌కార్ట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త వెబ్‌సైట్‌ లాంచింగ్‌పై మాత్రం ఫ్లిప్‌కార్ట్‌ స్పందించలేదు. 

మరిన్ని వార్తలు