ఫ్లిప్ కార్ట్ లో సోషల్ చాట్ ఉండదట..!

21 Jun, 2016 12:10 IST|Sakshi

బెంగళూరు : ఇక దేశీయ ఆన్ లైన్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో సోషల్ చాట్, ఇమేజ్ సెర్చ్ లు ఉండవట. కేవలం 10 నెలల్లోనే తను ఆవిష్కరించిన ఇన్-యాప్ చాట్ సర్వీస్ పింగ్ ను ఫ్లిప్ కార్ట్ నిలిపివేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అదేవిధంగా ఇమేజ్ సెర్చ్ ఫీచర్ కూడా ఇక వినియోగదారులకు అందుబాటులో ఉండదని తెలిపారు. పింగ్ సర్వీసు ద్వారా వినియోగదారులు ఉత్పత్తులను బ్రౌజ్ చేసుకోవడానికి, వాటి గురించి స్నేహితులతో షేరు చేసుకోవడానికి వీలుండేది. ఫ్లిప్ కార్ట్ యాప్ ద్వారా ఈ సర్వీసులను వినియోగదారులు ఉపయోగించుకునేవారు. అయితే ప్రస్తుతం వినియోగదారుల ఆసక్తి తగ్గడంతో, ఈ సర్వీసులను నిలిపి వేస్తున్నట్టు కంపెనీకి చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు. కంపెనీ నుంచి ఏప్రిల్ లో వైదొలిగిన మాజీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునిత్ సోని ఈ పింగ్ సర్వీసును గతేడాది ఆగస్టు 25న ఆవిష్కరించారు. పింగ్ ను ఆవిష్కరించిన 10 రోజుల్లోనే 2.5 మిలియన్ యూజర్లు దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు.

2016 జూన్ 25 తర్వాత స్నేహితులతో, కుటుంబసభ్యులతో పింగ్ ద్వారా చాట్ చేసుకోవడానికి వీలుపడదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఏ సందేశానైనా, ఉత్పత్తుల గురించైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో యూజర్లు షేరు చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇమేజ్ సెర్చ్ ను నిలిపివేసినా.. "విజువల్లీ సిమిలర్ " ఫీచర్ ద్వారా తమ ప్లాట్ ఫామ్ లో షాపింగ్ తేలికగా చేయొచ్చని  కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. పింగ్ కు భర్తీగా "యూజర్ టూ సెల్లర్" ఫీచర్ ను కంపెనీ ఆవిష్కరించింది. అదేవిధంగా "యూజర్ టూ కస్టమర్ కేర్" చాట్ ప్లాట్ ఫామ్ ను త్వరలోనే తీసుకురానున్నట్టు పేర్కొంది. ఈ కొత్త యూజర్ టూ సెల్లర్ ఫీచర్ తో ఉత్పత్తిని కొనుగోలుచేసేటప్పుడు అమ్మకందారులతో యూజర్లు చాట్ చేసుకునేలా అవకాశం ఉండనుంది. ఈ పైలట్ ప్రాజెక్టు జూలై చివరి నుంచి ప్రారంభంకానున్నాయి.

మరిన్ని వార్తలు