ఐదేళ్లలో రూ. 16,250 కోట్లు ఖర్చుచేస్తాం: ఫ్లిప్‌కార్ట్

31 Oct, 2015 00:48 IST|Sakshi
ఐదేళ్లలో రూ. 16,250 కోట్లు ఖర్చుచేస్తాం: ఫ్లిప్‌కార్ట్

గిడ్డంగులు, లాజిస్టిక్స్‌కు వ్యయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వచ్చే నాలుగైదేళ్లలో సుమారు రూ.16,250 కోట్లు వెచ్చించనుంది. ఈ మొత్తాన్ని గిడ్డంగుల ఏర్పాటుతోపాటు లాజిస్టిక్స్‌కు వ్యయం చేయనున్నట్టు కంపెనీ సీవోవో బిన్నీ బన్సల్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద ఫ్లిప్‌కార్ట్ ఏర్పాటు చేసిన భారీ గిడ్డంగిని ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. ‘2019-20 నాటికి 80-100 గిడ్డంగులను ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక.

వీటిలో మూడు, నాల్గవ తరగతి పట్టణాల్లో సగం గిడ్డంగులను నెలకొల్పుతాం. దేశంలోని కస్టమర్లకు రెండు రోజుల్లోనే ఉత్పత్తులను చేర్చాలన్నది లక్ష్యం. రెండు మూడేళ్లలో లాభాల్లోకి వస్తాం’ అని సీవోవో తెలిపారు. కంపెనీ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 40 శాతం. మేడ్చల్ గిడ్డంగి నుంచి ఒక రోజులోనే ఈ రాష్ట్రాలకు ఉత్పత్తులను సరఫరా చేసే వీలుంది. ఫ్లిప్‌కార్ట్‌లో పోచంపల్లి చీరలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయని కంపెనీ వివరించింది.
 
చిన్న వ్యాపారుల్నీ సంరక్షిస్తాం: ఈటల
ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల రాకతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. ఈ-కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల రిటైల్ వర్తకులు నష్టపోతున్నారన్న సాక్షి ప్రతినిధి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. పెద్ద కంపెనీలు భారీగా కొనుగోలు చేస్తాయి కాబట్టి వాటికి తక్కువ ధరకు సరుకులు వస్తాయి.

అందుకే డిస్కౌంట్ ఇవ్వగల్గుతున్నాయి. అయితే కంపెనీలతోపాటు చిన్న, మధ్యతరహా వ్యాపారులనూ బతికించుకుంటాం’ అని మంత్రి వివరించారు. కస్టమర్లు ఆన్‌లైన్‌లో కొంటున్నారు కాబట్టి రిటైలర్లు కూడా వ్యాపార విధానాన్ని మార్చుకోవాల్సిందేనని బన్సల్ స్పష్టం చేశారు. రిటైలర్ల వ్యాపార విస్తరణకు తాము వేదికగా ఉన్నామన్నారు.

మరిన్ని వార్తలు