కోవిడ్‌ : పరిశ్రమలకు ఆర్థికమంత్రి అభయం

18 Feb, 2020 20:36 IST|Sakshi
పరిశ్రమ వర్గాలతో భేటీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

సరఫరా,  సల్పకాలిక ధరలపై భయాలు అవసరంలేదు- నిర్మలా సీతారామన్‌

వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆర్థికమంత్రి పలువురు పరిశ్రమ పెద్దలతో సమావేశం 

తగిన చర్యలు చేపడతాం

సాక్షి,న్యూఢిల్లీ:   చైనాలో వ్యాపించి, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రభావాలపై కేంద్ర  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు.  ప్రధానంగా దేశీయంగా ఆటో,ఫార్మ, తదితర రంగాలపై ఈ వైరస్‌ సృష్టిస‍్తున్న సంక్షోభంపై  సమీక్షించిన ఆమె, దేశీయ పరిశ్రమలకు భయాలు అవసరం  లేదంటూ భరోసా ఇచ్చారు. ఈ వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ రంగాల ప్రముఖులతో ఆమె  భేటీ అయ్యారు. వాణిజ్య, కస్టమ్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆటో, పేపర్, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, రసాయన, ఇంధనం, సౌర, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, ఫార్మా రంగాల ప్రతినిధులు, ఫిక్కీ, సిఐఐ, అసోచం నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

పరిశ్రమలకు అందించగల ఉపశమనం గురించి  పీ​ఎంవో చర్చించనున్నట్లు నిర్మల సీతారామన్  చెప్పారు. ముడి పదార్ధాల సరఫరాపై ఫార్మా, సౌర , రసాయన పరిశ్రమల ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారని అయితే, ముడి పదార్థాల కొరత గురించి తక్షణ ఆందోళనలను తొలగించడంతో పాటు, ధరలను నియత్రించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ చర్యలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుందని ఆమె చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయాన్నిసంప్రదించిన తరువాత ఖరారు కానున్న కార్యాచరణను రూపొందించడానికి బుధవారం కార్యదర్శులు మరోసారి సమావేశమవుతారని సీతారామన్ చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులు ఆయా విభాగ కార్యదర్శులతో చర్చించనున్నట్లు ఆమె తెలిపారు.  ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని ఆమె అన్నారు. ప్రధానంగా ఔషధాల ముడి సరుకు నిల్వపై దేశీయ ఫార్మ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫార్మా తయారీ, ఔషధాల లభ్యత కొరతను నివారించడానికి, చైనా నుండి  ఏఐపీ సామాగ్రిని విమానంలో దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని  ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి.

చదవండి : కోవిడ్‌ : పరిస్థితి భయంకరంగా ఉంది

మరిన్ని వార్తలు