చౌకగా.. నాణ్యమైన ఉత్పత్తులు

28 Nov, 2015 00:55 IST|Sakshi
చౌకగా.. నాణ్యమైన ఉత్పత్తులు

ఎగుమతిదారులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచన
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడం వల్ల ఎగుమతులు క్షీణిస్తుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేలా అనువైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయంగా ఎదురైన అనుభవాలను బట్టి చూస్తే ప్రపంచ దేశాలు నాణ్యమైన ఉత్పత్తులు, చౌకగా లభిస్తే కొనుక్కునేందుకు మొగ్గు చూపుతున్నాయని తెలుస్తుందని ఆయన చెప్పారు.  

అంతర్జాతీయంగా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతోందని, దీంతో తమ ఉత్పత్తులను కొనగలిగేవారిని చేరడం విక్రేతలకు కష్టంగా మారుతోందని ఆయన వివరించారు. ఇతరులకన్నా భిన్నంగా యోచించి నాణ్యమైన ఉత్పత్తులు చౌకగా అందించే ప్రయత్నం చేయాలని, తద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలని జైట్లీ సూచించారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.

ఎగుమతులు వరుసగా 11వ నెలలోనూ క్షీణించడం, అక్టోబర్‌లో 17.5% తగ్గి 21.35 బిలియన్ డాలర్లకు పడియాయి. మరోవైపు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగేందుకు ట్రేడ్ ఫెయిర్స్ ఊతమిస్తాయని జైట్లీ చెప్పారు. ఈ ఏడాది ఐఐటీఎఫ్‌ను 17 లక్షల మంది పైగా సందర్శించారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు