భారీ పన్ను సంస్కరణపై హింట్‌ ఇచ్చిన జైట్లీ

27 Jan, 2018 15:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్‌-2018 కొన్ని రోజుల ముందు భారీ  పన్ను సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం  హింట్‌ ఇచ్చింది. విప్లవాత్మక పన్ను సంస్కరణలను తీసుకురానున్నామని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ  శనివారం ప్రకటించారు. ఎప్పటి నుంచో కొంతమంది ప్రజలకు ఎక్కువ మొత్తంలో పన్నులు విధిస్తున్నారని, ఈ ప్రక్రియను మార్చాల్సి ఉందని జైట్లీ చెప్పారు. నేషనల్‌ కస్టమ్స్‌ డే సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి  ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 పరోక్ష పన్నుల విధానాన్ని జీఎస్టీ పూర్తిగా మార్చివేసిందన్నారు.  చాలా తక్కువ సమయంలోనే జీఎస్టీ తన నిలకడను సంపాదించుకుందని, దీని బేస్‌ను పెంచడానికి భవిష్యత్తులో రేట్లను మరింత హేతుబద్ధం చేసే అవకాశం ఉందన్నారు. మరోవైపు జనవరి 29న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  సోమవారం, జనవరి 29 మధ్యాహ్నం, ఈ ఏడాది ఆర్థిక సర్వే ఆఫ్ ఇండియా పార్లమెంటులో  ప్రవేశ పెట్టనున్నామని   ప్రధాన ఆర్థిక సలహాదారు  అరవింద్‌ సుబ్రమణియన్‌ శనివారం ట్విటర్‌లో వెల్లడించారు.

కాగా పార‍్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఆదివారం సమావేశం కానున్నారు.    దేశాధ్యక్షుడు రామనాధ్‌ కోవింద్‌  తొలిసారి పార్లమెంటు ఉభయ సభలను  ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  అలాగే 2019 ఎన్నికలకు ముందు బీజేపీ ఆధర్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి చివరి బడ్జెట్‌ సమావేశాలు. దీంతో ఈ సమాశాలపై తీవ్ర ఉత‍్కంఠ నెలకొంది.   

మరిన్ని వార్తలు