‘త్వరలో యస్‌ బ్యాంక్‌ పునర్వ్యవస్థీకరణ’

6 Mar, 2020 18:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన యస్‌ బ్యాంక్‌ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ హామీ ఇచ్చిందని, ఈ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌బీఐ అంగీకరించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన అనిల్‌ అంబానీ గ్రూప్‌, ఎస్సెల్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌, వొడాఫోన్‌ వంటి కంపెనీలకు యస్‌ బ్యాంక్‌ భారీ రుణాలిచ్చిందని మంత్రి పేర్కొన్నారు.యస్‌ బ్యాంక్‌లో ఇంతటి భారీస్ధాయిలో సమస్యలకు దారితీసిన పరిస్ధితులు, బాధ్యులెవరనే దానిపై ఆర్బీఐ నిగ్గుతేల్చాలని, వారిపై సత్వర చర్యలు చేపట్టేందుకు కేంద్ర బ్యాంక్‌ యస్‌ బ్యాంక్‌ పరిస్ధితులను తక్షణం మదింపు చేయాలని ఆమె పేర్కొన్నారు. యస్‌ బ్యాంకు ఆస్తులు, అప్పులు..ఉద్యోగులు వారి వేతనాలపై సంక్షోభ ప్రభావం ఉండబోదని మంత్రి భరోసా ఇచ్చారు. కనీసం ఏడాది వరకూ ఎలాంటి ఇబ్బందులూ ఉండవని అన్నారు.

చదవండి : ఆర్థికమంత్రి భరోసా : షేరు రికవరీ

మరిన్ని వార్తలు