దుబాయి షెల్‌ కంపెనీలపై ఫోకస్‌

22 May, 2018 00:56 IST|Sakshi

పన్ను ఎగవేతలపై ఆరా తీస్తున్న ఐటీ శాఖ

హాంకాంగ్, చైనాలోని సబ్సిడరీలపైనా దృష్టి

భారత కంపెనీల లావాదేవీలన్నిటిపైనా సీబీ‘ఐ’  

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ దుబాయిలో మకాం వేసిన భారత షెల్‌ కంపెనీలపై నిఘా పెట్టింది. భారత కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు మధ్య ప్రాచ్యం, ముఖ్యంగా దుబాయి కేంద్రంగా నిర్వహించిన లావాదేవీలను పరిశీలిస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. నీరవ్‌మోదీ, చోక్సీ ద్వయం చేసిన మోసం ఈ దిశగా దారి చూపించినట్లయింది. దేశీయంగా షెల్‌ కంపెనీలపై (ఏ వ్యాపారం లేకుండా నడిచేవి) కేంద్ర ప్రభుత్వం ఇటీవల కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

దుబాయిలోని స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతంలో సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా నిధుల్ని కొల్లగొట్టి, పన్నుల ఎగవేతకు పాల్పడి ఉంటాయని కొన్ని కంపెనీలను ఆదాయపన్ను శాఖ (ఐటీ) అనుమానిస్తోంది. కమోడిటీలు, ఇతర ఎగుమతి రంగాలకు సంబంధించి మధ్య స్థాయి కంపెనీల లావాదేవీలను ఇప్పటికే ఇది పరిశీలించింది. వీటిలో కొన్ని లావాదేవీలకు సంబంధించి అదనపు వివరాలు కోరుతూ ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

పన్నులు ఎగ్గొట్టేందుకే ఆయా దేశాల్లో కంపెనీలను (ఎస్‌పీవీలు) నెలకొల్పి ఉంటారని భావిస్తున్నామని, వాటి లావాదేవీల్లో పారదర్శకత లేకపోవడమే ఈ అనుమానాలకు కారణమని అధికార వర్గాలు చెబు తున్నాయి. వీటికి రానున్న వారాల్లోనూ నోటీసుల జారీ ఉంటుందని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి.

మోదీ, చోక్సీలు చేసింది ఇదే...:‘‘యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ప్రతీ ఎమిరేట్‌ విడిగా ఆదాయపన్ను శాఖ ఆదేశాలను ఆమోదించి ఉంటుంది. కానీ వాటి అమలును మాత్రం విదేశీ బ్యాంకులు, చమురు కంపెనీలకే పరిమితం చేస్తారు. దీంతో అక్కడ ఏర్పాటయిన ఇతర కంపెనీ విషయంలో అవి పన్నులు ఎగ్గొట్టేందుకే ఏర్పాటయి ఉంటాయని ఐటీ అధికారులు అనుమానించటం అసహజమేమీ కాదు’’ అని కేపీఎంజీ ట్యాక్స్‌ హెడ్‌ హితేష్‌ డిగజారియా చెప్పారు. 

వజ్రాల వ్యాపారులు నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీలు లెటర్‌ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ల ద్వారా పీఎన్‌బీని రూ.13,000 కోట్లకుపైగా మోసగించిన విషయం తెలిసిందే. వీరు దుబాయి స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన పెట్టుబడి కంపెనీలను ఇందుకు వినియోగించుకోవడం గమనార్హం. అయితే, ఐటీ శాఖ విచారణ దుబాయికే పరిమితం కాలేదని, హాంగ్‌కాంగ్, చైనా తదితర ప్రాంతాల్లోని సబ్సిడరీలపైనా దృష్టి పెట్టిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

యూఏఈ కీలక నిర్ణయం
దేశీయ బ్యాంకులకు రూ.6,800 కోట్లు ఎగవేసిన విన్‌సమ్‌ డైమండ్స్‌ అండ్‌ జ్యుయలరీకి సంబంధించి భారత్‌తో సమాచారం పంచుకునేందుకు యూఏఈ తమ దేశ బ్యాంకులను అనుమతించింది. బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకు అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు. దేశీయ బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసిన కంపెనీల్లో ఇదీ ఒకటి.

విన్‌సమ్‌ డైమండ్స్‌ అండ్‌ జ్యుయలరీకి (లిస్టెడ్‌ కంపెనీ) రుణాలిచ్చిన బ్యాంకులకు స్టాండర్డ్‌ చార్టర్డ్‌ లీడ్‌ బ్యాంకుగా ఉంది. ఈ బ్యాంకుకు ఈఏఈలో పెద్ద సంఖ్యలో శాఖలున్నాయి. విన్‌సమ్‌ గ్రూపు సంస్థలు, సబ్సిడరీలు, దుబాయి క్లయింట్ల ఖాతాల్లోని లావాదేవీల సమాచారం పంచుకునేందుకు అనుమతివ్వడంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి కీలకం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు