ప్రైవేటీకరణే ప్రభుత్వ ప్రధాన అజెండా

22 May, 2019 00:49 IST|Sakshi

ఎగుమతులు, కార్మిక, భూ సంస్కరణలపై దృష్టి 

కొత్త ప్రభుత్వం ప్రాథమ్యాలపై గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక

ముంబై: ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు అనంతరం ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రైవేటీకరణ, ఎగుమతులకు ప్రోత్సాహం ప్రధాన అజెండాగా ఉంటాయని కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఒక నివేదికలో అభిప్రాయపడింది. వీటితో పాటు భూ, కార్మిక సంస్కరణలపైనా ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలియజేసింది. ‘స్థలాల వేలంలో పారదర్శకత పెంచడం... రికార్డుల డిజిటైజేషన్, కార్మిక చట్టాల సంస్కరణలు, వ్యవసాయం.. బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో ప్రైవేటీకరణ మొదలైన సంస్కరణలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది‘ అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తన నివేదికలో పేర్కొంది. అలాగే తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాల్లోని కొత్త మార్కెట్లు లక్ష్యంగా ఎగుమతులను ప్రోత్సహించడం, విశ్వసనీయ గ్రేడింగ్‌.. సర్టిఫికేషన్‌ వ్యవస్థను రూపొందించడంపైనా కొత్త సర్కార్‌ కీలక చర్యలు తీసుకోవచ్చని వివరించింది. సంస్కరణలు మరింత వేగం పుంజుకోవడం, లేదా యథాతథ స్థితిలోనే ఉండటం లేదా మళ్లీ పాత రోజులకు మళ్లడమనే మూడు రకాల పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వీటి ప్రభావాలను కూడా అంచనా వేసింది. 2020–2025 మధ్యకాలంలో సగటున 7.5 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి రేటుపై 2.5 శాతం పాయింట్ల మేర అటూ, ఇటూగా ఈ అంశాలు ప్రభావం చూపవచ్చని పేర్కొంది.  

సంస్కరణలు వేగవంతం 
ఒకవేళ చట్టపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు తగినంతగా పూర్తి మెజారిటీతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే సంస్కరణలు వేగవంతం అవుతాయని పేర్కొంది. అయితే, వీటి అమల్లో ప్రభుత్వ సంకల్పం కూడా ముఖ్యమని వివరించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ధోరణలకు అనుగుణంగా ఉంటే రాబోయే మూడు నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సుమారు 69 స్థాయిలో తిరుగాడవచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది. మధ్యకాలికంగా చూస్తే పన్నెండు నెలల వ్యవధిలో 71 స్థాయిలో ఉండొచ్చని వివరించింది. ఎన్నికల తర్వాత చలామణీలో ఉన్న నగదు పరిమాణం తగ్గి, బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. 

>
మరిన్ని వార్తలు