ఫెడ్ మీటింగ్‌పై ఫోకస్...

15 Jun, 2015 02:23 IST|Sakshi
ఫెడ్ మీటింగ్‌పై ఫోకస్...

అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై ఇన్వెస్టర్ల దృష్టి
- దేశంలో రుతుపవనాల గమనం కూడా మార్కెట్‌కు కీలకం
న్యూఢిల్లీ:
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మార్కెట్స్ కమిటీ సమావేశం ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నదన్న సంకేతాల్ని ఇటీవల అక్కడ వెలువడుతున్న గణాంకాలు ధ్రువపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే మంగళ, బుధవారాల్లో జరిగే ఫెడ్ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి వెలువడే క్లూలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ వారం తర్వాత మళ్లీ సెప్టెంబర్ వరకూ ఫెడ్ కమిటీ సమావేశం వుండదు. ఇక దేశీయంగా రుతుపవనాల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల రీతి మార్కెట్‌కు కీలకమని విశ్లేషకులు చెప్పారు. ఈ ఏడాది వర్షపాతం సగటుకంటే తక్కువగా వుంటుందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ చెప్పారు. గత శుక్రవారం మార్కెట్ ముగిశాక వెలువడిన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు సానుకూలంగా వున్నందున, ఈ సోమవారం తొలుత మార్కెట్ పాజిటివ్‌గా ట్రేడ్‌కావొచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయితే భారత స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నందున, ట్రేడింగ్ తొలిదశలో ఆర్జించిన లాభాల్ని మార్కెట్ నిలబెట్టుకోవడం కష్టమని అగర్వాల్ వివరించారు. జూన్ 16-17న జరిగే ఫెడ్ సమావేశం తర్వాత వడ్డీరేట్లపై అనిశ్చితి తొలగిపోతుందని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు.
 
గతవారం మార్కెట్..
వర్షాభావ భయాలతో ఇన్వెస్టర్లు జరిపిన విక్రయాల కారణంగా గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ గతవారం 343 పాయింట్లు క్షీణించి 26,425 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడువారాల్లో సెన్సెక్స్ 1,520 పాయింట్లు నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 7,983 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాల్లో ఈ సూచి 476 పాయింట్లు తగ్గింది.
 
ఎఫ్‌ఐఐల విక్రయాలు  4,700 కోట్లు
న్యూఢిల్లీ: జూన్ నెల తొలి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ. 4,700 కోట్లు వెనక్కు తీసుకున్నారు. దేశీయ కార్పొరేట్ లాభాలు మందగిస్తున్నాయన్న ఆందోళన, ఆసియాలో చైనా, జపాన్ తదితర దేశాల ఈక్విటీల రాబడులు మెరుగ్గా వుండటంతో ఇక్కడ విదేశీ ఇన్వెస్టర్లు విక్రయిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. జూన్ 1-12 మధ్యకాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈక్విటీ మార్కెట్లో రూ. 1,310 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 3,431 కోట్ల నికర విక్రయాలు జరిగాయి.

మరిన్ని వార్తలు