అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి

1 Dec, 2015 03:20 IST|Sakshi
అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి

 బాలిస్టిక్ సేఫ్టీ సిస్టమ్స్ డెరైక్టర్ పురుషోత్తం వెల్లడి
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్ల వంటి భద్రత ఉపకరణాల తయారీలో ఉన్న బాలిస్టిక్ సేఫ్టీ సిస్టమ్స్ టెక్నాలజీ (బీఎస్‌ఎస్‌టీ) విదేశీ మార్కెట్లపై దృష్టి పెట్టింది. జర్మనీతోపాటు భారత్‌లోనూ ప్లాంటు ఉన్న ఈ సంస్థ... అంతర్జాతీయ ప్రమాణాలతోభద్రత ఉపకరణాలను రూపొందిస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ పురుషోత్తం మహావాది తెలియజేశారు. విక్రయానికి అంతర్జాతీయ మార్కెట్లే ఉత్తమమని, అక్కడి రక్షణ సంస్థలు ఖర్చుకు వెనుకాడవని వెల్లడించారు. డిఫెన్స్, ఏరోస్పేస్ సదస్సులో భాగంగా సోమవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. యునిసెఫ్ శాంతి దళాలు, ఖజకిస్తాన్ సైన్యం, కొచ్చిన్ షిప్‌యార్డ్, రిలయన్స్ తమ క్లయింట్ల జాబితాలో ఉన్నాయన్నారు. 2ప్లాంట్లకు కలిపి ఇప్పటి వరకు రూ.230 కోట్లకుపైగా ఖర్చు చేశామన్నారు.  ప్రపంచంలో తొలిసారి స్మార్ట్ సెన్సార్స్‌తో కూడిన బాలిస్టిక్స్ హెల్త్ మానిటర్స్‌ను కంపెనీ రూపొందించింది.
 
  ప్రస్తుతం దీని పేటెంట్ పెండింగ్‌లో ఉందని కంపెనీ ప్రతినిధి ఎం.కృష్ణ మోహన్ తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ ఏ మేరకు రక్షణ కల్పిస్తుందో ఈ సెన్సార్స్ గుర్తించి అలర్ట్ చేస్తాయని చెప్పారు. రక్షణ రంగంలో ఉన్న మహిళల కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను భారత్‌లో తొలిసారిగా తయారు చేశామన్నారు. ఫ్యాబ్ సిటీ వద్ద ఉన్న ప్లాంటుకు ఏటా 30 వేల జాకెట్లు, 30 వేల హెల్మెట్లు, 50 వేల బ్లాంకెట్లు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది.
 

>
మరిన్ని వార్తలు