ఆఫ్‌లైన్‌పైనా ఇన్‌‘ఫోకస్’

10 Nov, 2015 02:01 IST|Sakshi
ఆఫ్‌లైన్‌పైనా ఇన్‌‘ఫోకస్’

ఆన్‌లైన్‌లో ధరతోనే మొబైల్స్ విక్రయం
 త్వరలో 2 ఇన్ 1 ట్యాబ్లెట్స్, టీవీలు
 సాక్షితో ఇన్‌ఫోకస్ కంట్రీ హెడ్ సచిన్ థాపర్


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న అమెరికా కంపెనీ ఇన్‌ఫోకస్ భారత్‌లో ఆఫ్‌లైన్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఈ-కామర్స్ కంపెనీలకే పరిమితమైన ఇన్‌ఫోకస్ మొబైల్స్ ఇక నుంచి రిటైల్ స్టోర్లలోనూ లభ్యం కానున్నాయి. జనవరికల్లా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ ఔట్‌లెట్లకు విస్తరించాలన్నది కంపెనీ ఆలోచన. ఇన్‌ఫోకస్‌కు చెందిన అన్ని మోడళ్లను ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది. ఇన్‌ఫోకస్ భారత్‌లో ప్రస్తుతం 6 స్మార్ట్‌ఫోన్లతోపాటు రెండు ఫీచర్ ఫోన్లను విక్రయిస్తోంది. ఫీచర్ ఫోన్లను కేవలం రిటైల్ ఔట్‌లెట్ల ద్వారానే అమ్మాలని కంపెనీ నిర్ణయించింది.

 ఒకే ధరలో లభ్యం..
 ఇన్‌ఫోకస్ స్మార్ట్‌ఫోన్ల్ల ధర రూ.3,999 నుంచి ప్రారంభం. అయితే ఆన్‌లైన్‌లో ఉన్న ధరనే ఆఫ్‌లైన్‌లోనూ కొనసాగిస్తోంది. ఇది వ్మూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమని సంస్థ ఇండియా హెడ్ సచిన్ థాపర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. నాణ్యమైన మోడళ్లను విలువకు తగ్గట్టుగా కస్టమర్లకు అందించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ‘ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లు రెండూ మాకు ముఖ్యం. భారత్‌లో ఇప్పటి వరకు 5 లక్షల స్మార్ట్‌ఫోన్లు విక్రయించాం. 2015-16లో 10 లక్షల యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా చేసుకున్నాం. ఫాక్స్‌కాన్‌కు చెందిన శ్రీసిటీ ప్లాంటులో నాలుగు మోడళ్లు తయారవుతున్నాయి. భారత్ నుంచి సార్క్, ఆఫ్రికా దేశాలకు మోడళ్లను ఒకట్రెండు నెలల్లో ఎగుమతి చేయనున్నాం’ అని తెలిపారు. కంపెనీ తన ఉత్పత్తులపై 12 నెలల వారంటీ ఇస్తోంది. 134 సర్వీసింగ్ కేంద్రాలున్నాయి.

 డిసెంబర్‌లో 2 ఇన్ 1..
 కంపెనీ భారత్‌లో 2 ఇన్ 1 హైబ్రిడ్ ట్యాబ్లెట్స్‌ను ప్రవేశపెడుతోంది. డిసెంబర్‌లో ఒక మోడల్ వస్తోంది. అలాగే అల్ట్రా హై డెఫినిషన్, ఫుల్ హై డెఫినిషన్ టీవీలు జనవరి నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సచిన్ థాపర్ వెల్లడించారు. టీవీలు 24-60 అంగుళాల సైజులో ఉంటాయన్నారు. నెల రోజుల్లో మరో 5 స్మార్ట్‌ఫోన్లు రానున్నాయని పేర్కొన్నారు. టీవీలు ఫాక్స్‌కాన్‌కు చెందిన చెన్నై ప్లాంటులో తయారవుతాయని చెప్పారు. భారత్‌లో 2016 నాటికి బిలియన్ డాలర్ కంపెనీగా నిలవాలన్నది కంపెనీ లక్ష్యం. ఇందులో స్మార్ట్‌ఫోన్ల ద్వారా 70 శాతం సమకూరుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి అమెజాన్, స్నాప్‌డీల్‌లు ఆన్‌లైన్ భాగస్వాములుగా ఉన్నాయి.
 

>
మరిన్ని వార్తలు