బ్యాంకులకు ‘కొసరు’ లాభం!

7 Nov, 2014 00:12 IST|Sakshi
బ్యాంకులకు ‘కొసరు’ లాభం!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు ఇంకా బ్యాంకింగ్ ఫలితాల్లో ప్రతిబింబించడం లేదు. ఇప్పటికీ కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పుంజుకోకపోవడంతో బ్యాంకులు చిన్న రుణాలపై దృష్టిసారిస్తున్నాయి. ఇదే సమయంలో మొండి బకాయిలు కొండలాగా పెరిగిపోతున్నాయి.

  కార్పొరేట్ రుణాలకు డిమాండ్ లేదని, బ్యాంకింగ్ వ్యాపారంలో వృద్ధి అంతంతమాత్రంగానే ఉందని ఇప్పటివరకూ ప్రకటించిన బ్యాంకుల ఫలితాల విశ్లేషణలో వెల్లడవుతున్నది. చాలా బ్యాంకుల వృద్ధి 15 శాతం లోపునకే పరిమితమయ్యింది.  రుణ వితరణ పెరగకపోవడంతో ఎన్‌పీఏలు ఎగబాకాయి. బ్యాంకింగ్ వ్యాపారానికి ప్రధానమైన వడ్డీ ఆదాయం వృద్ధి అంతంతమాత్రమే వుండగా, వివిధ ఫీజుల ద్వారా ఆర్జించే ఇతర ఆదాయాలు బాగా పెరగడంతో బ్యాంకులు లాభాల్ని ప్రదర్శించగలిగినట్లు ఫలితాలు చెపుతున్నాయి.

 ఆదుకున్న ఇతరాదాయాలు
 ఒకట్రెండు బ్యాంకులను మినహాయిస్తే చాలా బ్యాంకులను ఇతరాదాయాలే ఆదుకున్నాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకుల్లో ఇది చాలా స్పష్టంగా కనిపించింది. ఈ సమీక్షా కాలంలో పీఎన్‌బీ నికర వడ్డీ ఆదాయంలో కేవలం 3% వృద్ధి నమోదైతే ఇతర ఆదాయంలో మాత్రం ఏకంగా 73% పెరిగింది. అలాగే కెనరా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8% పెరిగితే, ఇతర ఆదాయంలో 32% వృద్ధి నమోదయ్యింది.

 హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకుల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలో 23% వృద్ధి నమోదైతే, ఇతర ఆదాయంలో 11% పెరుగుదలే కనిపించింది. యాక్సిస్ బ్యాంక్ వడ్డీ ఆదాయంలో 20%, ఇతర ఆదాయంలో 10% వృద్ధి నమోదయ్యింది. ఇక మిగిలిన బ్యాంకులను పరిశీలిస్తే మాత్రం లాభాల్లో ఇతర ఆదాయాలే కీలకపాత్ర పోషించాయి.

 కార్పొరేట్స్‌కు దూరం..
 ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతున్నా... రుణాలు తీసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం లేదు.  కానీ కార్పొరేట్ రుణాల విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకుల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ప్రైవేటు బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కార్పొరేట్ రుణాల్లో రెండంకెలపైన వృద్ధి నమోదైతే, ఐసీఐసీఐ బ్యాంక్‌లో మాత్రం  ఈ వృద్ధి 4.5 శాతంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ నాన్ రిటైల్ రుణాల్లో  36 శాతం వృద్ధి నమోదైతే, యాక్సిస్ బ్యాంక్‌లో 13% వృద్ధి నమోదయ్యింది.

ప్రభుత్వరంగ బ్యాంకులైతే కార్పొరేట్ రుణాల జోలికి వెళ్లకుండా ఆటోమొబైల్, పర్సనల్ లోన్స్, వ్యవసాయం, హోమ్‌లోన్స్, ఎంఎస్‌ఎంఈ రుణాల కేసి చూస్తున్నాయి. దేశంలో రెండో అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంక్ పీఎన్‌బీ కార్పొరేట్ రుణాల్లో 3.1% వృద్ధి మాత్రమే సాధించింది.

 పెరుగుతున్న ఎన్‌పీఏలు...: బ్యాంకింగ్ రంగాన్ని ఎన్‌పీఏలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో పరిస్థితి ఒకే విధంగా ఉంది. వీటిని తగ్గించుకోవడానికి బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలితమివ్వడం లేదు. వచ్చే ఐదు నెలల్లో మరో రూ. 60 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు రుణాలు పునర్ వ్యవస్థీకరించాల్సి రావచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది.

ప్రస్తుతం అన్ని బ్యాంకులు కలిసి 3.45 లక్షల కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించగా, మరో 2.55 లక్షల కోట్ల రుణాలు ఎన్‌పీఏలుగా మారాయి. ప్రస్తుత ఫలితాలను పరిశీలిస్తే గతేడాదితో పోలిస్తే ఎన్‌పీఏలు భారీగా పెరిగినట్లు కనిపిస్తున్నా... తొలి త్రైమాసికంతో పోలిస్తే వీటి పెరుగుదల ఉధృతి తగ్గడం కొద్దిగా ఊరటనిచ్చే అంశం. ఎన్‌పీఏల బెడద ఇంకా ఉన్నప్పటికీ గత మూడేళ్లతో పోలిస్తే కొత్తగా ఏర్పడుతున్న ఎన్‌పీఏల్లో తగ్గుదల కనిపిస్తోందని మరో రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎన్‌పీఏలు విలువ పరంగా పెరిగినట్లు కనిపించినప్పటికీ శాతాల్లో చూస్తే ఏడు బేసిస్ పాయింట్లు తగ్గడం విశేషం.

అలాగే యాక్సిస్ బ్యాంక్‌లో గతేడాదితో పోలిస్తే ఎన్‌పీఏల్లో 32 శాతం వృద్ధి నమోదైనట్లు కనిపించినా, తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ వృద్ధి కేవలం 4 శాతం మాత్రమే. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండటంతో ఇక ఎన్‌పీఏలు తగ్గడమే కాని పెరగడం ఉండదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 బ్యాలెన్స్‌షీట్‌పై దృష్టి...
 గత కొన్నేళ్లుగా దెబ్బతిన్న బ్యాలెన్స్ షీట్‌ను చక్కదిద్దడంపై బ్యాంకులు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. రుణాలకు డిమాండ్ లేకపోవడంతో డిపాజిట్ల సేకరణను తగ్గించుకుంటున్నాయి. ప్రధానంగా అధిక వడ్డీరేటుకు వసూలు చేసే బల్క్ డిపాజిట్లను వదలించుకోవడంతో పాటు, దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించేస్తున్నాయి.

రుణాలకు డిమాండ్ పెరిగే వరకు డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిసారిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్ తెలిపారు. అధిక వడ్డీరేటు ఉన్న బల్క్ డిపాజిట్లను వదిలించుకోవడంతో పాటు, అధిక వడ్డీరేటు ఉన్న రుణాలపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నట్లు ఎస్‌బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ వెల్లడించారు. అలాగే కొన్ని బ్యాంకులు ఎన్‌పీఏలను అసెట్ రీ కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించడం ద్వారా బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపర్చుకుంటున్నాయి. ఈ మూడు నెలల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 290 కోట్లు, బీవోఐ రూ. 106 కోట్లు, ఎస్‌బీహెచ్ రూ. 200 కోట్ల ఎన్‌పీఏలను విక్రయించాయి.

 పరుగులు తీస్తున్న బ్యాంక్ షేర్లు
 రెండో త్రైమాసిక ఫలితాలు మొదలైనప్పటి నుంచి బ్యాంక్ షేర్లు పరుగులు తీస్తున్నాయి. గత నెల రోజుల్లో నిఫ్టీ 5% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 13%పైగా ఎగసింది. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టనున్న సంకేతాలకు తోడు, ఎన్‌పీఏల వృద్ధిరేటు  తగ్గడం బ్యాంక్ షేర్లు పెరగడానికి ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం ప్రైవేటు రంగ బ్యాంక్ షేర్లు పెరుగుతున్నా, రానున్న కాలంలో పీఎస్‌యూ బ్యాంక్ షేర్లూ పరుగులు తీయొచ్చని జెన్‌మనీ జాయింట్ ఎండీ సతీష్ కంతేటి చెప్పారు. చాలా పీఎస్‌యూ బ్యాంకులు బాండ్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయని, ఒక్కసారి వడ్డీరేట్లు తగ్గితే ఈ బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయని, ఆ మేరకు బ్యాంకుల ఇతరాదాయాలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం మీద  బాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఒక్కసారి వడ్డీరేట్లు తగ్గితే ఎన్‌పీఏలు తగ్గుముఖం పడతాయంటున్నారు.

 మొండి బకాయిల తీరు ఇదీ...
 బ్యాంకు పేరు              జీఎన్‌పీఏ(క్యూ2-15)                    జీఎన్‌పీఏ(క్యూ2-14)
 ఐసీఐసీఐ               11,547 కోట్లు (3.12%)                        10,028 కోట్లు (3.08%)
 హెచ్‌డీఎఫ్‌సీ              3,362 కోట్లు (1.02%)                       2,942 కోట్లు (1.1%)
 యాక్సిస్                  3,613 కోట్లు (1.3%)                          2,734 కోట్లు (1.2%)
 పీఎన్‌బీ                  20,752 కోట్లు(5.65%)                         16,526 కోట్లు (5.1%)
 బీవోఐ                   14,127 కోట్లు ( 3.54%)                         9,880 కోట్లు (2.93%)
 ఆంధ్రా బ్యాంక్            6,884 కోట్లు (5.99%)                          5,187 కోట్లు (5.15%)
 కెనరా బ్యాంక్           9,164 కోట్లు (2.92%)                                7,475 కోట్లు (2.64%)
 ఇండియన్ బ్యాంక్     5,003 కోట్లు (4.21%)                         4,179 కోట్లు (3.76%)
 స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) రూ. కోట్లలో, బ్రాకెట్లో స్థూల నిరర్థక ఆస్తులు శాతాల్లో ఇవ్వడం జరిగింది

మరిన్ని వార్తలు